ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.25,077 కోట్లు

11 Jan, 2022 08:11 IST|Sakshi

డిసెంబర్‌లో గణనీయమైన పెట్టుబడుల రాక 

సిప్‌ పెట్టుబడులు రూ.11,305 కోట్లు 

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో డిసెంబర్‌ నెలలో ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో పెట్టుబడులు పెట్టారు. ఈక్విటీ ఫండ్స్‌ నికరంగా రూ.25,077కోట్లను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో పెట్టుబడుల రాక కూడా బలంగా నమోదైంది. మల్టీక్యాప్‌ ఫండ్స్‌లోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా పదో నెలలోనూ నమోదైంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) తాజా గణాంకాలను తన పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. డిసెంబర్‌లో పెట్టుబడుల రాక గతేడాది జూలై తర్వాత అత్యధిక స్థాయిలో ఉంది. గతేడాది జూలైలో ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు రూ.25,002 కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చి నుంచి ఈక్విటీ ఫండ్స్‌ నికరంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి. ఈ కాలంలో మొత్తం రూ.1.1 లక్షల కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. అంతకుముందు 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.46,791 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. 

అన్ని విభాగాల్లోకి.. 
ఈక్విటీల్లో దాదాపు అన్ని విభాగాలు పెట్టుబడులను ఆకర్షించాయి. మల్టీక్యాప్‌ విభాగంలోకి అత్యధికంగా రూ.10,516 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.313 కోట్లుగా ఉన్నాయి. డెట్‌ విభాగం నుంచి నికరంగా రూ.49,154 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. 20 నూతన పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు)  ఫండ్స్‌ సంస్థలు ప్రారంభించాయి.  

రూ.37.72 లక్షల కోట్లు 
2021 డిసెంబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని ఇన్వెస్టర్ల ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.37.72 లక్షల కోట్లకు చేరింది. నవంబర్‌ చివరికి ఈ మొత్తం రూ.37.34 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 

సిప్‌ జోరు..  
సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిస్‌) ద్వారా డిసెంబర్‌లో రూ.11,305 కోట్లు ఈక్విటీల్లోకి వచ్చాయి. నవంబర్‌లో సిప్‌ పెట్టుబడులు రూ.11,005 కోట్లు. సిప్‌ ఖాతాలు కూడా 4.78 కోట్ల నుంచి 4.91 కోట్లకు పెరిగాయి. ‘‘క్రమానుగత పెట్టుబడులకు, సాధారణ వ్యక్తి సైతం క్రమశిక్షణగా ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు సిప్‌ ఆకర్షణీయ సాధనంగా మారింది’’ అని యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ అన్నారు. సిప్‌ రూపంలో మార్కెట్లలో అస్థిరతలను అధిగమించొచ్చని ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నట్టు చెప్పారు. సిప్‌ వల్ల పెట్టుబడుల వ్యయం సగటుగా మారుతుందని తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు