500 రూపాయల కోట్లు కనీసం ఉండాలి.. 

5 Aug, 2020 08:12 IST|Sakshi

ఇంధన లైసెన్సు నిబంధనలపై కేంద్రం 

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్‌ ఇంధన విక్రయాల లైసెన్సు నిబంధనలకు సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ వివరణనిచ్చింది. రిటైల్, బల్క్‌ కొనుగోలుదారులకు ఈ రెండింటినీ విక్రయించేందుకు లైసెన్సు కావాలంటే దరఖాస్తు చేసుకునే సమయానికి కనీసం రూ. 500 కోట్లు నికర విలువ ఉండాలని పేర్కొంది. బల్క్‌ లేదా రిటైల్‌ వినియోగదారులకు (ఏదో ఒక వర్గానికి మాత్రమే) పెట్రోల్, డీజిల్‌ విక్రయ లైసెన్సు పొందాలంటే కనీసం రూ. 250 కోట్ల నికర విలువ ఉండాలని తెలిపింది. గతేడాది ప్రకటించిన ఇంధన లైసెన్సింగ్‌ విధానంపై కేంద్రం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.

దేశీయంగా ఇంధన రంగంలో పోటీని ప్రోత్సహించేందుకు విక్రయాల నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకుంది. చమురుయేతర సంస్థలను కూడా ఈ విభాగంలోకి అనుమతించింది. తద్వారా ప్రైవేట్, విదేశీ సంస్థలు కూడా ఇందులో ప్రవేశించేందుకు వీలు లభించినట్లయింది. గత నిబంధనల ప్రకారం భారత్‌లో ఇంధన రిటైలింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే సదరు సంస్థ హైడ్రోకార్బన్ల అన్వేషణ ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్‌లైన్‌లు లేదా ధ్రువీకృత సహజ వాయువు టెర్మినల్స్‌ మొదలైన వాటిలో రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాల్సి వచ్చేది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు