రూ. 500 కోట్ల నిధుల సమీకరణ ప్లాన్స్‌: వోడాఫోన్‌ ఐడియా జూమ్‌

21 Jun, 2022 13:38 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ టెల్కో వోడాఫోన్ ఐడియా భారీ ఎత్తున నిధులను సమీకరించనుంది.  5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి తరుణంలో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. దీంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో వోడాఫోన్‌ షేర్‌ దాదాపు 3 శాతం లాభపడింది.  వోడాఫోన్ గ్రూప్ సంస్థలకు ప్రాధాన్యత ఆధారంగా ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టిబుల్ వారెంట్ల ద్వారా రూ. 500 కోట్ల వరకు నిధులను సమీకరించే ప్రతిపాదనను పరిశీలించడానికి బోర్డు బుధవారం సమావేశమవుతుందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్  సమాచారంలో వెల్లడించింది.  

వోడాఫోన్‌ ఐడియా గ్రూపు నుంచి రూ. 500 కోట్ల ఫండ్ ఇన్ఫ్యూషన్ ప్లాన్‌ను పరిశీలించేందుకు వోడాఫోన్ ఐడియా బోర్డు బుధవారం సమావేశం కానుంది.  దీనికి బోర్డు ఆమోదం తె లిపితే  రెండు నెలల్లో ఇది రెండవది కావడం విశేషం. మరోవైపు  బోర్డు ఆమోదించిన రూ. 25,000 కోట్ల అదనపు పెట్టుబడులకు గాను ఇటీవలి రూ. 4,500 కోట్ల పెట్టుబడులకు తోడు తమకు ఇంకా రూ. 20,000 కోట్లు అవసరమని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందర్ టక్కర్ ఇటీవల వెల్లడించారు. ఫండ్ ఇన్ఫ్యూషన్‌తో సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడంతోపాటు, 5జీ  పెట్టుబడులపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. 

కాగా ఈ ఏడాది మార్చిలో ఇద్దరు ప్రమోటర్ల రూ. 4,500 కోట్ల నిధుల సమీకరణను కంపెనీ బోర్దు ఆమోదించింది. వోడాఫోన్‌  ఐడియాలో  వొడాఫోన్ గ్రూప్ దాదాపు రూ.3,375 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.1,125 కోట్లు పెట్టింది. అయితే, ఎయిర్‌టెల్‌, జియోలతో పోలిస్తే కంపెనీ ఇప్పటివరకు ఒక్క విదేశీ ఇన్వెస్టర్‌  పెట్టుబడులను సేకరించ లేకపోయింది.   

మరిన్ని వార్తలు