‘రూ.50,000 కోట్ల లోన్‌ గ్యారంటీ స్కీమ్‌’టార్గెట్‌ అదే!

1 Sep, 2021 08:37 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వైద్య సదుపాయాల విస్తరణ కోసం తీసుకొచ్చిన ‘రూ.50,000 కోట్ల లోన్‌ గ్యారంటీ స్కీమ్‌’ లక్ష్యాలను సాధించాలని బ్యాంకులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు.

‘‘గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వైద్య సదుపాయాల విస్తరణ కీలకమైనది. వైద్య సదుపాయాలు మెరుగుపడడం అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు సాయపడుతుంది. ఈ పథకం లక్ష్యాల మేరకు రుణాలను సకాలంలో మంజూరు చేయాలి. దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న చోటు దీన్ని మరింతగా చురుగ్గా అమలు చేయాలి. పరిశ్రమ భాగస్వాములు, బ్యాంకులు, ఆర్థిక సేవల విభాగం కలసికట్టుగా దీన్ని సాధించాలి’’ అంటూ మంగళవారం నిర్వహించిన ఓ వెబినార్‌లో భాగంగా మంత్రి కోరారు.  

ఐటీలో టెక్నాలజీ వినియోగంపై సూచనలు 
ఆదాయపన్ను శాఖలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని విస్తృతం చేసే విషయమై ఆలోచనలు పంచుకోవాలని ఆ శాఖ యువ అధికారులను మంత్రి కోరారు. అధికారులతో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. యవ అధికారులకు సీనియర్‌ అధికారులు మార్గదర్శనం చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు