Shantanu Narayen:189 బిలియన్‌ డాలర్ల కంపెనీకి సారధి: రోజుకు రూ.70 లక్షలు సంపాదన

27 May, 2023 12:56 IST|Sakshi

 ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్శిటీ నుంచి అమెరికా దాకా విజయ బావుటా

 టెక్‌  ప్రపంచాన్ని ఏలుతున్న హైదదాబాదీ షాన్‌, శంతను నారాయణ్‌ 

హైదరాబాద్‌లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు శంతను నారాయణ్. సంకల్పం, కృషి, పట్టుదల ప్రతిభతో తన కలను సాకారం చేసుకున్న గొప్ప వ్యక్తి. 189 బిలియన్ డాలర్ల టెక్‌ దిగ్గజం అడోబ్‌కు సీఈవోగా రోజుకు రూ. 70 లక్షలు సంపాదిస్తున్న నాన్-ఐఐటియన్. భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్తగా,  ప్రపంచాన్నేలుతున్న శంతను నారాయణ్‌ బర్త్‌డే సందర్భంగా సక్సెస్‌ స్టోరీ.. 

కార్పొరేట్ ప్రపంచంలో విజయం సాధించాలంటే ఐఐటీ లేదా ఐఐఎంలో చేరడం తప్పనిసరి. కానీ  ఐఐటీ చదవ కుండానే  ప్రపంచంలోని అతిపెద్ద, దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ అడోబ్‌కు ఛైర్మన్, ప్రెసిడెంట్, సీఈవోగా ప్రతిభను చాటు కుంటున్నారు. ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్స్‌లో ఒకరిగా ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు.

శంతను నారాయణ్ 1962, మే 27 హైదరాబాద్‌లో జన్మించారు. ఫ్యామిలీలో ఆయన రెండో కుమారుడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్) పూర్తి చేశారు. ఆ తర్వాత 1986లో ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ , కాలిఫోర్నియా యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొదారు.  

క్యాంపస్ రిక్రూట్‌మెంట్ సమయంలో ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగానికి బదులు 1986లో MeasureX Automobiles System అనే స్టార్టప్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ మరుసటి సంవత్సరం, 1989లో  యాపిల్‌లో చేరారు. అక్కడ ఆరేళ్ల పాటు పలు పోర్ట్‌ఫోలియోల్లో పనిచేశారు.  ఇక్కడ పరిచయమైన గురుశరణ్ సింగ్ సంధు తన గురువుగా చెప్తుంటారు.. సవాళ్లను ఎదుర్కొనే మార్గాన్ని ఆయన నుంచే తాను నేర్చుకున్నానంటారు శంతను.

యాపిల్‌ను వీడిన తరువాత సిలికాన్ గ్రాఫిక్స్‌లో డైరెక్టర్‌గా చేరిన కొన్నాళ్ల తరువాత అడోబ్ సిస్టమ్స్‌లో  సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గాచేరారు. ఇక అప్పటినుంచి ఆయన కరియర్‌ మరింత దూసుకుపోయింది. 2005లో సీవోవో, 2007లో  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. 2008 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి సంస్థను విజయవంతంగా గట్టెక్కించారు. ఒక విధంగా చెప్పాలంటే శంతను నారాయణ్ హయాంలోనే అడోబ్ సిస్టమ్స్  ప్రపంచంలోనే  టాప్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీగా అవతరించింది.  

కుటుంబ నేపథ్యం 
తల్లి ప్రొఫెసర్. అమెరికన్ సాహిత్యాన్ని బోధించేవారు. తండ్రి వ్యాపారవేత్త. శంతను బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీలో ఉన్నప్పుడు  రేణితో పరిచయం పెళ్లికి దారితీసింది. ఆమె  క్లినికల్ సైకాలజీలో డాక్టరేట్  సాధించారు. ఈ దంపతులకు శ్రవణ్ ,  అర్జున్ నారాయణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 

శంతనుకి క్రికెట్, సెయిలింగ్ అంటే చాలా ఆసక్తి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆసియా రెగట్టా పోటీలో సెయిలింగ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం. అంతేకాదు  శంతనుకి చిన్నతనంలో జర్నలిజం పట్ల మక్కువ ఉండేదట. తను బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉండకపోతే, అతను ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడిగా ఉండేవాడినని స్వయంగా ఆయనే చెప్పారు.

అడోబ్‌తో పాటు, శాంతను డెల్ ఇంక్, ఫైజర్ ఇంక్ , హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కాలిఫోర్నియాలో డైరెక్టర్ల బోర్డు సభ్యుడు. అంతేకాదు, శంతను అడోబ్ ఫౌండేషన్‌ అధ్యక్షుడు కూడా. ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన శంతను 2022లో  దాదాపు 256 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. 

ప్రతిష్టాత్మక అవార్డులు,  రివార్డులు
2009లో, శంతను నారాయణ్ ప్రతిష్టాత్మకమైన అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్  బిజినెస్ అండ్ ఫిలాంత్రోపిక్ లీడర్‌షిప్ అవార్డును పొందారు. అదే సంవత్సరంలో, 'ది టాప్ గన్  సీఈవో జాబితాలో స్థానం సంపాదించారు. 
♦ 2011లో ఓహియోస్ బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది.
♦ 2011లో  అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సలహా మండలి సభ్యునిగా నియమితులయ్యారు.
♦ శంతను నారాయణ్ ఫైజర్ కంపెనీకి స్వతంత్ర డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 
US-India స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్‌కి వైస్-ఛైర్మన్‌గా ఉన్నారు.
♦ ఫార్చ్యూన్   బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో  12వ స్థానం
♦ ది ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా'  గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డుతో  సత్కరించింది.  
 ♦ 2019 లో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును కూడా అందుకోవడం విశేషం. 

మరిన్ని వార్తలు