అల్ట్రాటెక్‌ లాభం రూ.796 కోట్లు

29 Jul, 2020 04:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూపులో భాగమైన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.796 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.1281 కోట్లతో పోలిస్తే 38 శాతం తగ్గిపోయింది. అమ్మకాల ద్వారా ఆదాయం సైతం 33 శాతం క్షీణించి రూ.11420 కోట్ల నుంచి రూ.7634 కోట్లకు పరిమితమైంది. వడ్డీ, తరుగుదల, పన్ను ముందస్తు లాభం రూ.2353 కోట్లుగా నమోదైంది. అదే విధంగా కంపెనీ వ్యయాలు సైతం 32 శాతం తగ్గి రూ.6,598 కోట్లుగా ఉన్నాయి. అమ్మకాల పరిమాణం 22 శాతం తక్కువగా నమోదైనట్టు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తెలిపింది. నిర్వహణపరమైన సామర్థ్యాలపై దృష్టి పెట్టడం ద్వారా కరోనా వైరస్‌ సంక్షోభ ప్రభావాన్ని ఎదుర్కొన్నట్టు పేర్కొంది.

‘‘జూన్‌ క్వార్టర్‌లో కార్యకలాపాలకు అవకాశం ఉన్న రోజులు 68. వ్యయాలు, నగదు ప్రవాహాలపై గట్టి నియంత్రణ కొనసాగించాము. దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న 64 ప్లాంట్లలో 60 శాతం సామర్థ్యాన్ని వినియోగించుకున్నాము. మే చివరి నుంచి ఆశ్చర్యం కలిగించే ధోరణులు కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్‌ వినియోగం అంచనాల కంటే అధికంగా నెలకొంది’’ అని కంపెనీ తెలిపింది. స్థిర వ్యయాలను 21 శాతం తగ్గించుకోవడంతోపాటు మూలధన నిధులను మెరుగ్గా నిర్వహించడం ద్వారా రుణ భారాన్ని రూ.2209 కోట్ల మేర తగ్గించుకున్నట్టు ప్రకటించింది. కంపెనీ పనితీరు అంచనాలను అందుకోవడంతో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ స్టాక్‌లో కొనుగోళ్లకు దారితీసింది. బీఎస్‌ఈలో 7 శాతానికి పైగా పెరిగి 4135.70 వద్ద క్లోజయింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా