నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!

4 Aug, 2022 10:45 IST|Sakshi

భోపాల్: భోపాల్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కోట్ల ఆస్తిని కూడబెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదుపై విచారణ జరిపిన మధ్యప్రదేశ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యు) అతని ఇంట్లో దొరికిన నగదు,  ఇతర ఆస్తి పత్రాలు చూసిన నివ్వెర పోయారు. స్థిరాస్తులు, ఇతర కోట్ల రూపాయల విలువైన ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు రూ 85 లక్షలకు పైగా నగదు లభించినట్టు అధికారులు వెల్లడించారు. లెక్కింపు, పత్రాల వెరిఫికేషన్ తర్వాతే అతడి మొత్తం విలువ తెలుస్తుందని ఈఓడబ్ల్యు  ఎస్పీ రాజేష్ మిశ్రా  తెలిపారు.

(ఇదీ చదవండి: అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్‌ఐసీ!)

నెలకు నాలుగువేల రూపాయల జీతంతో రాష్ట్ర వైద్య విద్యా శాఖలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌గా కరియర్‌ ప్రారంభించిన  హీరో కేశ్వాని  ప్రస్తుతం నెలకు దాదాపు రూ.50 వేల జీతం తీసుకుంటున్నాడు. అక్రమ ఆస్తులు ఫిర్యాదుల  విచారణ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు అతని నివాసంలో సోదాలు నిర్వహించగా రూ. 85 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నోట్ లెక్కింపు యంత్రాన్ని సాయంతో డబ్బును లెక్కించినట్టు ఈఓడబ్ల్యు అధికారి తెలిపారు. అలాగే  కోట్లాది రూపాయల  పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు  వెల్లడించారు. అంతేకాదు  ఖరీదైన అలంకార వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే  కేస్వానీ నివాసం విలువ సుమారు కోటిన్నర ఉంటుందని  అంచనా వేశారు.

కేశ్వాని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయినట్లు గుర్తించారు. ఎలాంటి ఆదాయ వనరులు లేని గృహిణి అయిన కేశ్వాని భార్య పేరిట చాలా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారి తెలిపారు. బైరాగఢ్ ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి వరకు ఈ సోదాలు కొనసాగాయి. అయితే ఇంకో ట్విస్టు ఏంటంటే అధికారుల సోదాలను ప్రతిఘటించిన కేశ్వానీ, తన  ఎత్తులు సాగకపోయేసరికి బాత్రూమ్ క్లీనర్‌ను తాగేశాడు.  అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని ఎస్పీ మిశ్రా  తెలిపారు.

మరిన్ని వార్తలు