-

క్రిప్టోపై కర్ర పెత్తనం? ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలు

15 Oct, 2021 14:02 IST|Sakshi

క్రిప్టో కరెన్సీపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ కన్నెర్ర చేసింది. దేశంలో క్రమంగా విస్తరిస్తున్న క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం నియంత్రించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఛీప్‌ మోహన్‌ భగవత్‌ డిమాండ్‌ చేశారు. విజయదశమిని పురస్కరించుకుని నాగ్‌పూర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

సంచలన వ్యాఖ్యలు
దసరా పండుగ రోజున ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఓటీటీ కంటెంట్‌, డ్రగ్స్‌ వినియోగం, జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడులు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేశారు.

నియంత్రించాలి
‘బిట్‌ కాయిన్‌లను ఏ దేశం, ఏ వ్యవస్థ దాన్ని నియంత్రించగలదో నాకు తెలియడం లేదు. కానీ దాన్ని కంట్రోల్‌ చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. కానీ అప్పటి వరకు ఏం జరుగుతుందనేది ఆందోళన కలిగిస్తోంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికాను మించి
తాజాగా వెల్లడైన గణాంకాల్లో అమెరికాను మించి ఇండియాలో క్రిప్టో కరెన్సీకి ప్రాచుర్యం పెరుగుతోంది. మరో రెండు మూడేళ్లలో యూరప్‌ని సైతం వెనక్కి నెట్టేలా క్రిప్టో ఇండియాలో దూసుకుపోతుంది. యువతలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ పట్ల క్రేజ్‌ రోజురోజుకి పెరుగుతోంది. జిల్లా కేంద్రాల్లో సైతం బిట్‌కాయిన్‌, ఈథర్‌నెట్‌ తదితర కాయిన్లు వర్చువల్‌గా చలామనీ అవుతున్నాయి. అయితే క్రిప్టో కరెన్సీ వ్యవస్థ మన ప్రభుత్వం దగ్గర నిర్థిష్టమైన విధానమంటూ లేదు. ఈ తరుణంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భద్రతపై సందేహాలు
సాధారణ మార్కెట్‌లో మనుషుల పెత్తనం, ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. దీంతో వీటిని శక్తివంతమైన వ్యక్తులు ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీని వల్ల మిగిలినవారు నష్టపోయే ప్రమాదం ఉంది. క్రిప్టో కరెన్సీ పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఇక్కడ మనుషులు, ప్రభుత్వాల పాత్ర నామమాత్రం. అయితే ఇందులో పెట్టుబడి పెట్టే డబ్బుకి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. అందువల్ల క్రిప్టో ట్రేడ్‌పై అనేక సందేహాలు ఉన్నాయి. 

చదవండి :బయ్‌ వన్‌ గెట్‌ వన్‌ ఫ్రీ ! పండగ వేళ ఇండస్ట్రియలిస్ట్‌ హర్ష్‌ పాఠాలు

మరిన్ని వార్తలు