ఇక రోజంతా ఆర్టీజీఎస్‌ సర్వీసులు

14 Dec, 2020 03:53 IST|Sakshi

నేటి నుంచి అమల్లోకి కొత్త విధానం

ముంబై: పెద్ద మొత్తంలో నగదు బదిలీ లావాదేవీలకు ఉపయోగించే రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్టీజీఎస్‌) సర్వీసులు ఇకనుంచీ రోజంతా 24 గంటలూ .. అందుబాటులో ఉండనున్నాయి. ఈ విధానం ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఇలాంటి సర్వీసులను ఏడాది పొడవునా, వారమంతా, ఇరవై నాలుగ్గంటలూ అందిస్తున్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్‌ కూడా చోటు దక్కించుకుంది. దీన్ని సుసాధ్యం చేసిన భాగస్వాములందరినీ అభినందిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ .. ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం రూ. 2 లక్షల దాకా నిధుల బదలాయింపునకు నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) విధానాన్ని, అంతకు మించితే ఆర్టీజీఎస్‌ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. నెఫ్ట్‌ సేవలు ఇప్పటికే రోజంతా అందుబాటులో ఉంటుండగా.. తాజాగా ఏడాది తర్వాత ఆర్టీజీఎస్‌ సేవలను కూడా ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. 2004 మార్చి 26న ఆర్టీజీఎస్‌ విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్లో నాలుగు బ్యాంకులతో మొదలైన ఈ విధానం ద్వారా ప్రస్తుతం రోజుకు రూ. 4.17 లక్షల కోట్ల విలువ చేసే 6.35 లక్షల పైచిలుకు లావాదేవీలు జరుగుతున్నాయి. 237 బ్యాంకులు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. 2020 నవంబర్‌లో ఆర్టీజీఎస్‌లో సగటు లావాదేవీ పరిమాణం రూ. 57.96 లక్షలుగా నమోదైంది.

జైపూర్‌లో బ్యాంక్‌నోట్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌
బ్యాంక్‌ నోట్ల చలామణీ పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ కోసం జైపూర్‌లో ఆటోమేటెడ్‌ బ్యాŠంక్‌నోట్‌ ప్రాసెసింక్‌ కేంద్రాన్ని (ఏబీపీసీ) ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ప్రింటింగ్‌ ప్రెస్‌ల నుంచి వచ్చే కరెన్సీ నోట్ల జమ, నిల్వ, డిస్పాచ్‌ మొదలైన కార్యకలాపాల కోసం దీన్ని ఉపయోగించనున్నారు. ఏబీపీసీ ఏర్పాటుకు అవసరమయ్యే సేవల నిర్వహణ కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆర్‌బీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.  2039–40 నాటికి దశలవారీగా సగటున రోజుకి 685 కోట్ల కొత్త నోట్లను, 2,775.7 కోట్ల పాత నోట్లను నిల్వ చేసే సామర్థ్యంతో ఏబీపీసీని రూపొందించనున్నారు. 2001 మార్చి నుంచి 2019 మార్చి దాకా చలామణీలో ఉన్న బ్యాంక్‌ నోట్ల పరిమాణం 3 రెట్లు పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరుతుందని అంచనా.

మరిన్ని వార్తలు