Irfan Pathan: మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌కు చేదు అనుభవం!

25 Aug, 2022 16:54 IST|Sakshi

ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. సంబంధిత అధికారులపై విస్తారా ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు.   

పఠాన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై నుంచి దుబాయ్‌కి విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించారు. ఈ ప్రయాణం సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ తన భార్య పిల్లలతో కలిసి  కౌంటర్ వద్ద పడికాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైనట్లు చెప్పారు. గ్రౌండ్ స్టాఫ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఈరోజు,నేను ముంబై నుండి విస్తారా ఫ్లైట్ యూకే -201లో దుబాయ్‌కి ప్రయాణిస్తున్నాను. చెక్ ఇన్ కౌంటర్‌లో చేదు అనుభవం ఎదురైంది. విస్తారా ఫ్లైట్‌లో నా టికెట్‌ క్లాస్‌ కాన్ఫామ్‌ అయ్యింది. కానీ విస్తారా డౌన్‌గ్రేడ్ (అంటే బుక్‌ చేసుకున్న క్లాస్‌ వేరే..వాళ‍్లు కాన్ఫామ్‌ చేసిన సీటు వేరు) చేసింది. దాన్ని ధృవీకరించేందుకు నన్ను వెయిట్‌ చేయించింది. కౌంటర్ వద్ద అరగంటకు పైగా ఎదురు చూశా. 

"గ్రౌండ్ స్టాఫ్ దురుసుగా ప్రవర్తించారు. సాకులు చెప్పారు. వాస్తవానికి, ఇద్దరు ప్రయాణికులకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. మేనేజ్‌మెంట్‌ను ఉద్దేశిస్తూ..వారు ఫ‍్లైట్‌ టికెట్‌లను ఇలా ఎందుకు అమ్ముతున్నారు. మేనేజ్మెంట్‌ ఎలా ఆమోదిస్తుందో? నాకు అర్థం కావడం లేదు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నా. నాకు ఎదురైన అనుభవం.. ఇంకెవరూ అనుభవించకూడదు" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే పఠాన్‌ ట్వీట్‌పై మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చౌప్రా స్పందించారు. ఎయిర్‌లైన్స్ నుండి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదని రిప్లయి ఇచ్చారు.

మరిన్ని వార్తలు