రూపాయికి తిప్పలే, 2023 మార్చి నాటికి 77.5కి రూపాయి పతనం!

19 Mar, 2022 07:37 IST|Sakshi

ముంబై: భారత్‌ కరెన్సీ రూపాయి విలువ డాలర్‌ మారకంలో 2023 మార్చి నాటికి 77.5కు బలహీనపడుతుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనావేసింది. అధిక ఇంధన ధరలతో పెరగనున్న కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారక నిల్వల మధ్య నికర వ్యత్యాసం), అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు వల్ల క్యాపిటల్‌ అవుట్‌ఫ్లోస్‌ (విదేశీ నిధులు దేశం నుంచి వెనక్కు మళ్లడం) వంటి అంశాలు తమ అంచనాలకు కారణమని తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తొలినాళ్లలో జరిగిన ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో 2022 మార్చి8వ తేదీన రూపాయి విలువ 77 కనిష్ట స్థాయిలో ముగియగా, ఇంట్రాడేలో 77.05 స్థాయినీ చూసింది. 


నివేదిక ప్రకారం... 
రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఫారెక్స్‌ మార్కెట్‌లో తన జోక్యాన్ని కొనసాగిస్తుంది. 630 బిలియన్‌ డాలర్లకుపైగా 12 నెలలకు సరిపడా పటిష్ట విదేశీ మారకద్రవ్య నిల్వలను భారత్‌ కొనసాగిస్తుండడమే దీనికి కారణం. రూపాయి తీవ్ర ఒడిదుడుకులను ‘ఆర్‌బీఐ జోక్యం’ కొంత నివారించవచ్చు. 

ఫెడ్‌ ఫండ్‌ రేటును బుధవారం 25 పైసలు పెంచిన (0.25–0.50 శాతం) సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరో ఆరుసార్లు రేట్లు పెంచవచ్చనీ సంకేతాలు ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్‌ ఆయిల్‌ బేరల్‌కు 85 డాలర్ల నుంచి 90 డాలర్ల శ్రేణిలో ఉండే వీలుంది. ఈ ప్రాతిపదికన దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి (జీడీపీలో) పెరగవచ్చు. 2021–22లో ఈ రేటు 1.6 శాతం. 

► ఫిబ్రవరి నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13.1 బిలియన్‌ డాలర్ల విదేశీ నిధులు వెనక్కు మళ్లాయి. గత దశాబ్ద కాలంలో ఇంత భారీ స్థాయిలో ఉపసంహరణలు ఇదే తొలిసారి. ఇది రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది.  

 అయితే 2013లో ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంచినప్పటి పరిస్థితి ప్రస్తుతం రూపాయికి ఎదురుకాకపోవచ్చు. భారత్‌కు భారీ విదేశీ మారక నిధుల దన్ను దీనికి కారణం. 

► ఇక లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)  మెగా ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌లో ఆశించిన నిధుల ప్రవాహం అలాగే 2023 ఆర్థిక సంవత్సరం చివరి భాగంలో గ్లోబల్‌ బాండ్‌ ఇండెక్స్‌లో భారతదేశం డెట్‌ ఇన్‌స్టమెంట్‌ను చేర్చడం వంటి అంశాలు భారత్‌ కరెన్సీకి సమీప కాలంలో మద్దతునిచ్చే అంశాలు.  
75.84 వద్ద రూపాయి... 

ఇక డాలర్‌ మారకంలో రూపాయి విలువ గురువారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో క్రితం ముగింపుతో పోల్చితే 37 పైసలు లభపడి 75.84 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీల పెరుగుదల, విదేశీ కరెన్సీల్లో డాలర్‌ బలహీనత దీనికి కారణం. వారంవారీగా చూస్తే, అమెరికన్‌ కరెన్సీలో రూపాయి విలువ 63 పైసలు లాభపడింది. హోలీ పండుగ నేపథ్యంలో సోమవారం ఫారెక్స్‌ మార్కెట్‌ పనిచేయదు.    

మరిన్ని వార్తలు