విదేశీ నిధుల ప్రవాహంపై రూపాయికి భరోసా!

21 Oct, 2021 06:30 IST|Sakshi

47 పైసలు లాభంతో 74.88 వద్దకు జంప్‌

రెండు వారాల గరిష్టం  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం రెండు వారాల గరిష్ట స్థాయికి ఎగసింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 47 పైసలు లాభపడి 74.88 వద్ద ముగిసింది.  రానున్న వారాల్లో  జారీ కానున్న క్విప్, ఐపీఓల ద్వారా మార్కెట్‌లోకి భారీ విదేశీ నిధుల ప్రవాహం జరుగుతుందన్న అంచనాలు రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయన్నది నిపుణుల అభిప్రాయం. దీనికితోడు ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా కొంత శాంతించడం, తగ్గిన డాలర్‌ ఇండెక్స్‌ దూకుడు వంటి అంశాలు కూడా రూపాయికి కలిసి వచ్చాయి. నిజానికి రూపాయి మరింత బలపడాల్సిందని, అయితే ఈక్విటీల బలహీన ధోరణి రూపాయిని కొంతమేర కట్టడి చేసిందని ఫారెక్స్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వర్థమాన దేశాల్లో భారత్‌ కరెన్సీనే బుధవారం ప్రధానంగా బలపడింది.

డాలర్‌పై చైనా యువాన్‌ ర్యాలీ (దాదాపు నాలుగు నెలల గరిష్టానికి అప్‌) మొత్తంగా ప్రాంతీయ కరెన్సీలకు మద్దతునిస్తోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌ దిలిప్‌ పార్మార్‌ పేర్కొన్నారు.  ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ  స్వల్ప లాభాల్లో  74.77 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ప్రాతిపదకన లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌  స్వల్ప నష్టాల్లో  93.64పైన ట్రేడవుతోంది.  రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ).  

మరిన్ని వార్తలు