మూడో రోజూ రూపాయి వీక్‌

9 Mar, 2021 05:53 IST|Sakshi

23 పైసలు డౌన్‌– 73.25 వద్ద ముగింపు

ముంబై: వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ బలహీనపడింది. డాలరుతో మారకంలో 23 పైసలు క్షీణించి 73.25 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి తొలుత 11 పైసలు తక్కువగా 73.13 వద్ద నీరసంగా ప్రారంభమైంది. అయితే తదుపరి కోలుకుని ఇంట్రాడేలో 72.93 వద్ద గరిష్టానికి చేరింది. ఆపై బలహీనపడుతూ ఒక దశలో 73.29కు చేరింది. చివరికి 73.25 వద్ద నిలిచింది. వెరసి మూడు రోజుల్లో 53 పైసలు కోల్పోయింది. యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ పుంజుకుంటున్న నేపథ్యంలో ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు దేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో అమ్మకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు డాలరు ఇండెక్స్‌ బలపడుతూ వస్తోంది. తాజాగా 0.3 శాతం ఎగసి 92.22కు చేరింది. దీంతో రూపాయి నీరసిస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్‌ సెనేట్‌ 1.9 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం, ఉపాధి గణాంకాలు పుంజుకోవడం, బాండ్ల ఈల్డ్స్‌ బలపడటం, అధిక క్రూడ్‌ ధరలు వంటి అంశాలతో డాలరు దాదాపు 4 నెలల గరిష్టానికి చేరింది.

మరిన్ని వార్తలు