రూపాయి పతనం.. సామాన్యులపై ధరల భారం

3 Oct, 2022 07:46 IST|Sakshi

న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ కొత్త రికార్డు స్థాయులకు పడిపోతుండటం .. ద్రవ్యోల్బణాన్ని ఎగదోయనుంది. దీనితో ముడి చమురు దిగుమతులు భారం కానున్నాయి. అలాగే కమోడిటీల రేట్లు కూడా పెరగనున్నాయి. ఫలితంగా ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించుకున్న 6 శాతం కన్నా అధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం ఇంకా పెరగనుంది. రూపాయి పతనంతో వంటనూనెల దిగుమతుల బిల్లు ఎగియనుందని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏఐ) ఈడీ బీవీ మెహతా తెలిపారు. ‘ఈ భారాన్ని అంతిమంగా వినియోగదారులకే బదలాయించాల్సి వస్తుంది. అయితే, నూనెగింజల ఎగుమతులు మాత్రమే కాస్త ఊరటనిచ్చే అవకాశం ఉంది. రూపాయి పతనంతో ఎగుమతులపరంగా ఆదాయం మెరుగుపడుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు.

భారత్‌ ఏటా 13 మిలియన్‌ టన్నుల వంటనూనెలు దిగుమతి చేసుకుంటోంది. ఆగస్టులో 1.89 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను (గతేడాది ఆగస్టుతో పోలిస్తే 41 శాతం అధికం) దిగుమతి చేసుకుంది. మరోవైపు, కమోడిటీల రేట్లు తగ్గినా రూపాయి పడిపోవడం వల్ల ఆ మేరకు ప్రయోజనం లేకుండా పోతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా చీఫ్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు. 

అటు, చారిత్రక గరిష్ట స్థాయుల నుంచి జూన్‌లో తగ్గిన తర్వాత అంతర్జాతీయంగా కమోడిటీల రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఎస్‌బీఐ ఒక నివేదికలో తెలిపింది. ఆగస్టు తొలినాళ్లలో కాస్త పెరిగినప్పటికీ డిమాండ్‌ మందగమనంపై ఆందోళనల కారణంగా మళ్లీ నెల చివర్లో తగ్గాయి. ఇంధన అవసరాల్లో 85 శాతం భాగాన్ని భారత్‌ దిగుమతి చేసుకుంటోంది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయి 82ను చూసిన సంగతి తెలిసిందే.  

క్షీణత కొనసాగవచ్చు.. 
అటు వాణిజ్య లోటు, ఇటు సంస్థాగత ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ పెరుగుతున్న నేపథ్యంలో రూపాయిపై మరింత ఒత్తిడి కొనసాగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కేంద్ర బ్యాంకూ కూడా కరెన్సీ పతనాన్ని అడ్డుకోజాలదని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. రూపాయి క్షీణతను పరిమిత కాలం పాటు ఆర్‌బీఐ కొనసాగనిచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఆర్‌బీఐ కరెన్సీ అసెట్లు 75 బిలియన్‌ డాలర్ల మేర కరిగిపోయాయని వివరించింది. ‘భారత్‌ ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో.. కరెన్సీ నిర్దిష్ట కనిష్ట స్థాయి దగ్గర సెటిల్‌ అయిన తర్వాత నుంచి పెరగడం ఒక్కసారిగా నాటకీయంగా పుంజుకోవచ్చు‘ అని పేర్కొంది. రూపాయి క్షీణతకు కారణం డాలరు పటిష్టంగా ఉండటమే తప్ప దేశీయంగా ఫండమెంటల్స్‌ బలహీనంగా ఏమీ లేవని వివరించింది.

మరిన్ని వార్తలు