4 నెలల గరిష్టానికి రూపాయి

4 Jan, 2021 14:09 IST|Sakshi

డాలరుతో మారకంలో 73 దిగువన షురూ

19 పైసలు బలపడి 72.93 వద్ద ప్రారంభం

ఇంట్రాడేలో 72.90- 73.03 మధ్య ఊగిసలాట

వారాంతాన 73.12 వద్ద ముగిసిన రూపాయి

ముంబై, సాక్షి: వారాంతాన ఒడిదొడుకులకు లోనైన దేశీ కరెన్సీ హుషారుగా ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 19 పైసలు పుంజుకుని 72.93 వద్ద ప్రారంభమైంది. డాలరుతో మారకంలో తదుపరి 72.90 వరకూ బలపడింది. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. ఒక దశలో 73.03 వరకూ బలహీనపడింది కూడా. గత వారం పలు దేశాల కరెన్సీ మార్కెట్లకు సెలవుకావడంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య 73.12 వద్ద ముగిసింది. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 32 నెలల  కనిష్టం 90 దిగువకు చేరిన విషయం విదితమే. ఇంతక్రితం 2018 ఏప్రిల్‌లో మాత్రమే డాలరు ఇండెక్స్‌ ఈ స్థాయిలో కదిలినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. (2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్‌)

వ్యాక్సిన్ల ఎఫెక్ట్‌
కోవిడ్‌-19 కట్టడికి వీలుగా వారాంతాన ప్రభుత్వం ఒకేసారి రెండు వ్యాక్సిన్లకు ఆమోదముద్ర వేయడంతో దేశీ కరెన్సీకి జోష్‌ వచ్చినట్లు ఫారెక్స్‌ నిపుణులు తెలియజేశారు. దీంతో ఆర్థిక వ్యవస్థ వేగవంత రికవరీని సాధించగలదన్న అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. దీనికితోడు అక్టోబర్‌ 1 నుంచీ చూస్తే దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో సుమారు 20 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయడం రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్‌లో దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐలు గత 12 ఏళ్లలోలేని విధంగా 8.1 బిలియన్‌ డాలర్లను పెట్టుబడులకు తరలించిన విషయం విదితమే. మరోపక్క డిసెంబర్‌లో రికార్డ్‌ స్థాయి జీఎస్‌టీ వసూళ్లు, కరెంట్‌ ఖాతా మిగులు వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు