పాతాళానికి రూపాయి, మరింత పతనం తప్పదా?

19 Jul, 2022 10:25 IST|Sakshi

మరో రికార్డు కనిష్టానికి రూపాయి 

తొలిసారి డాలరుమారకంలో80 స్థాయికి పతనం

సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరోసారి పాతాళానికి పడిపోయింది. డాలరుతో పోలిస్తే తొలిసారి 80కి చేరుకుంది.  మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 79.9863 వద్ద ప్రారంభమై తర్వాత  యుఎస్ డాలర్‌తో రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 80.05 నమోదు చేసింది. ఇంట్రా-డే రికార్డు కనిష్ట స్థాయి 80.0175ని తాకింది. సోమవారం 79.97 వద్ద ముగిసింది. 

పలు కేంద్ర బ్యాంకుల సమాశాలు, ముఖ్యంగా యూఎస్‌ పెడ్‌ రిజర్వ్‌ ట్రేడర్లు దృష్టి పెట్టారు. ఫలితంగా డాలరు బలం పుంజుకోవడంతో రూపాయి వరుసగా ఏడో సెషన్‌లో రికార్డు స్థాయికి చేరింది. ఈ  స్థాయిలో మరింత క్షీణత తప్పదనే  ఆందోళన ట్రేడర్లలో నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశీయ ఈక్విటీల నుండి  రికార్డు మొత్తంలో దాదాపు 30 బిలియన్ల డాలర్లు పెట్టుబడులను విదేశీ మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. దీనికి తోడు చమురు ధరలు, క్షీణిస్తున్న కరెంట్-ఖాతా లోటుపై ఆందోళనలు కరెన్సీకి బలహీనతకు కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా బలహీనంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఏకంగా 700 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ నేడు ఆరంభంలో సుమారు 200 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం సూచీలు రెండూ ఫ్టాట్‌గా కొనసాగుతున్నాయి.

మరోవైపు డిసెంబర్ 31, 2014 నుండి భారత రూపాయి దాదాపు 25 శాతం క్షీణించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు చెప్పారు. రూపాయి విలువ 63.33 నుండి జూలై 11, 2022 నాటికి 79.41కి తగ్గిందని ఆర్‌బిఐ డేటాను ఉటంకిస్తూ లోక్‌సభకిచ్చిన ఒక  రాతపూర్వక సమాధానంలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్  యుద్ధం, ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినతరం లాంటి గ్లోబల్ కారకాలు అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడటానికి ప్రధాన కారణాలని ఆమె చెప్పారు.
 

ఇది కూడా చదవండి:  లాభాలు పాయే, ఫ్లాట్‌గా సూచీలు

మరిన్ని వార్తలు