దిగుమతులకు రూపాయి సెగ

16 Jul, 2022 08:19 IST|Sakshi

ముడి చమురు, ఎల్రక్టానిక్స్‌ అన్నీ ఖరీదు 

అంతర్జాతీయంగా ధరలు తగ్గినా దక్కని ఊరట 

రూపాయి క్షీణతతో ప్రయోజనం లేని పరిస్థితి 

ఎగుమతిదారులకు అనుకూలత  

న్యూఢిల్లీ: రూపాయి విలువ క్షీణత ఎన్నో రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ముడిచమురు దగర్నుంచి, ఔషధాల ముడిసరుకు దిగు మతులు,  ఎలక్ట్రానిక్స్‌ దిగుమతుల వరకు అన్నీ భారంగా మారుతున్నాయి. అదేవిధంగా విదేశీ విద్య కోసం వెళ్లేవారు, విదేశీ పర్యటనకు వెళ్లేవారిపై మరింత ప్రభావం పడనుంది. డాలర్‌తో రూపాయి మారకం ఇటీవలే 8 శాతానికి పైగా క్షీణించడం గమనార్హం. రూపాయి విలువ క్షీణత ప్రభావం తక్షణం ఎదుర్కొనేది దిగుమతిదారులే. అంతకుముందు రోజులతో పోలిస్తే వారు దిగుమతుల కోసం మరింత మొత్తాన్ని వెచి్చంచాల్సి వస్తుంది.

అదే సమయంలో ఎగుమతి రంగానికి రూపాయి విలువ క్షీణత కలిసొస్తుంది. డాలర్‌-రూపాయి మారకంలో వారికి మరిన్ని నిధులు లభిస్తాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా  పెరిగాయి. అక్కడి నుంచి అవి కొంత మేర తగ్గుముఖం పట్టాయి. కానీ, ఇదే కాలంలో రూపాయి విలువ క్షీణత.. చమురు ధరల తగ్గుదల ప్రయోజాన్ని తుడిచిపెట్టేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం రూ.79.99కు పడిపోగా, శుక్రవారం సైతం 79.91 వద్ద స్థిరపడింది.  

దిగుమతులే ఎక్కువ.. 
మన దేశ ముడిచమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవే కాకుండా వంట నూనెలు, బొగ్గు, ప్లాస్టిక్‌ మెటీరియల్, రసాయనాలు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు ఇలా దిగుమతి జాబితా పెద్దదిగానే ఉంది. దిగుమతుల్లో ప్రధానంగా ముడిచమురు వాటాయే ఎక్కువగా ఉంటోంది. వీటి కోసం అధిక మొత్తాన్ని చెల్లించుకోవాలి. ఉదాహరణకు ఆరు నెలల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ 74 స్థాయిలో ఉంది. ఇప్పుడు 80కు చేరింది. ఆరు నెలల్లోనే రూపాయి 8 శాతం విలువను కోల్పోయింది. కనుక ఆరు నెలల క్రితం కొన్న ఒక ఫోన్‌కు ఇప్పుడు మరింత మొత్తం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. రానున్న రోజుల్లో రూపాయి 82 స్థాయి వరకు వెళుతుందన్న అంచనాలు ఉన్నాయి. ముడిచమురుతోపాటు మొబైల్‌ ఫోన్లు, ఖరీదైన టీవీలు, సంపన్న కార్లు, కీలక ముడిపదార్థాల దిగుమతుల కోసం ఇప్పుడు 8 శాతం అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

ఇక ఈ పరిస్థితులు ఎగుమతిదారులకు, విదేశాల్లో సంపాదిస్తూ స్వదేశంలోని తల్లిదండ్రులకు నగదు పంపించే వారికి అనుకూలం. రూపాయి క్షీణించడం వల్ల మారకంలో మరిన్ని రూపాయలు వీరు పొందగలరు. జూన్‌ నెలలో దిగుమతులు 57 శాతం పెరిగి 66.31 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021 జూన్‌లో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 9.60 బిలియన్‌ డాలర్లు ఉంటే, 2022 జూన్‌ నెలలో 173 శాతం పెరిగి ఇది 26.18 బిలియన్‌ డాలర్లకు పెరిగిపోయింది. రూపా యి బలహీనత వల్లేనని భావించాలి. విద్యుత్‌ అవసరాలకు బొగ్గును సైతం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జూన్‌ నెలలో చమురు దిగుమతుల విలువ రెట్టింపై 21.3 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. వంట నూనెల దిగుమతులు 26 శాతం పెరిగి 1.81 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.   
సబ్సిడీల భారం..
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోయిన ఎరువుల ధరల ప్రభావం మనమీదా పడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఎరువుల సబ్సిడీల బిల్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కోట్లకు చొరొచ్చన్న అభిప్రాయం నెలకొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీలకు కేంద్రం రూ.1.62 లక్షల కోట్లు ఖర్చు చేసింది.

ఫారెక్స్‌ నిల్వల భారీ పతనం 
భారత్‌ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్‌) జూలై 8వ తేదీతో ముగిసిన వారంలో (అంతక్రితం జూలై 1తో ముగిసిన వారంతో పోల్చి) భారీగా 8.062 డాలర్లు తగ్గి 580.252 బిలియన్‌ డాలర్లకు పడ్డాయి. ఎగుమతులకన్నా, దిగుమతులు పెరగడం, వెరసి వాణిజ్యలోటు భారీ పెరుగుదల, రూపాయి పతనాన్ని అడ్డుకోడానికి మార్కెట్‌లో ఆర్‌బీఐ పరిమిత జోక్యం వంటి అంశాలు ఫారెక్స్‌ నిల్వల తగ్గుదలకు కారణంగా కనబడుతోంది. 2021 సెపె్టంబర్‌ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్‌ డాలర్లకు చేరాయి.     

మరిన్ని వార్తలు