డాలర్‌ బలం – రూపాయి బలహీనం

3 Sep, 2020 06:38 IST|Sakshi

16 పైసలు నష్టంతో 73.03కు పతనం

ముంబై: ఆరు కరెన్సీలతో (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ట్రేడయ్యే– డాలర్‌ ఇండెక్స్‌ బలోపేతంకావడం రూపాయి సెంటిమెంట్‌పై బుధవారం ప్రభావాన్ని చూపింది. ఇంటర్‌ బ్యాంక్‌ పారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 16 పైసలు బలహీనపడి 73.03 వద్ద ముగిసింది. కరోనా తీవ్ర సవాళ్లు విసరడానికి కొద్ది రోజుల ముందు– మార్చి మధ్యస్థంలో 52 వారాల గరిష్టం 104 వరకూ వెళ్లిన డాలర్‌ ఇండెక్స్, అటు తర్వాత తీవ్ర ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో క్రమంగా తగ్గుతూ మంగళవారం 52 వారాల కనిష్టం 91.73ను చూసింది.

అయితే బుధవారం వెలువడిన అమెరికా తయారీ పరిశ్రమ ఇండెక్స్‌ ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడంతో డాలర్‌ కనిష్ట స్థాయిల నుంచి కొంత కోలుకుంది. ఇది రూపాయి సెంటిమెంట్‌పై స్వల్ప ప్రభావాన్ని చూపినట్లు ఫారెక్స్‌ ట్రేడర్లు పేర్కొంటున్నారు. అయితే భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల రాక కొనసాగడం, స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ కొనసాగితే, రూపాయి మరింత బలపడే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. డాలర్‌ మారకంలో రూపాయి విలువ మంగళవారం భారీగా 73 పైసలు లాభపడి 72.87 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ).

మరిన్ని వార్తలు