53 పైసలు బలపడి..10 వారాల గరిష్టానికి రూపాయి

28 Aug, 2021 08:09 IST|Sakshi

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం 53 పైసలు బలపడి 73.69 స్థాయికి చేరింది. గడచిన 10 వారాల్లో రూపాయి ఇంత స్థాయిలను చూడ్డం (జూన్‌ 16 తర్వాత) ఇదే తొలిసారి.  సరళతర ఆర్థిక విధానాలనే అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడరల్‌ రిజర్వ్‌ కొనసాగిస్తుందన్న అంచనాలు, ఈక్విటీ మార్కెట్ల బులిష్‌ వైఖరి వంటి అంశాలు రూపాయి భారీగా బలపడ్డానికి కారణమని నిపుణుల అంచనా. 

ఫారెన్‌ బ్యాంకుల డాలర్‌ అమ్మకాలు, దేశంలోకి విదేశీ నిధులు భారీగా వస్తాయన్న అంచనాలు కూడా రూపాయి బలోపేతానికి కారణం.  రూపాయి గురువారం ముగింపు 74.22. దీనితో పోల్చితే శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాలతో 74.17 వద్ద ప్రారంభమైంది. వారంలో రూపాయి 70 పైసలు బలపడింది. ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ  73.78 వద్ద ట్రేడవుతోంది. 

ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ప్రాతిపదకన లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌ 93పైన ట్రేడవుతోంది.  రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ).

చదవండి : వడ్డీ రేట్ల పెంపు దిశగా అమెరికా

మరిన్ని వార్తలు