రెండో రోజూ రూపాయి పరుగు

6 Nov, 2020 14:06 IST|Sakshi

74 దిగువకు బలపడిన దేశీ కరెన్సీ

తొలుత 51 పైసల హైజంప్

73.87 వద్ద ఇంట్రాడే గరిష్టానికి

గురువారం సైతం 40 పైసలు అప్

ముంబై: ఈ వారం మొదట్లో సాంకేతికంగా కీలకమైన 75 సమీపానికి నీరసించిన దేశీ కరెన్సీ వరుసగా రెండో రోజు కోలుకుంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో తొలుత 40 పైసలు(0.5 శాతం) జంప్ చేసి 73.98ను తాకింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 74 దిగువకు బలపడింది. తొలుత ఒక దశలో 51 పైసలు పుంజుకుని 73.87 వరకూ పురోగమించింది. అయితే ప్రస్తుతం కాస్త వెనకడుగు వేసింది. 19 పైసల లాభంతో 74.19 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో మారకంలో గురువారం రూపాయి 40 పైసలు లాభపడి 74.38 వద్ద ముగిసింది. 

కేంద్ర బ్యాంకుల సపోర్ట్
అవసరమైతే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మరిన్ని మానిటరీ చర్యలను చేపట్టేందుకు సిద్ధమంటూ తాజా పాలసీ సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చింది. మరోపక్క బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తాజా సమీక్షలో స్టిములస్ ను 190 బిలియన్ డాలర్ల మేరపెంచుతూ నిర్ణయించింది. దీంతో బాండ్ల కొనుగోలు ద్వారా అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీ దాదాపు 900 బిలియన్ పౌండ్లకు చేరనున్నట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. అమెరికా ప్రెసిడెంట్ రేసులో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ అంశాల కారణంగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల కారణంగా రూపాయి సైతం బలపడినట్లు ఫారెక్స్ వర్గాలు వివరించాయి. గురువారం నగదు విభాగంలో ఎఫ్ పీఐలు రూ. 5,368 కోట్ల పెట్టుబడులను కుమ్మరించడం గమనార్హం. 

మరిన్ని వార్తలు