నాలుగు రోజుల్లో రూపాయికి తొలి లాభం

20 Jan, 2022 02:26 IST|Sakshi

14పైసలు లాభంతో 74.44కు అప్‌  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుస నాలుగురోజుల ట్రేడింగ్‌ సెషన్లలో తొలిసారి లాభపడింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 14పైసలు లాభపడి 74.44 వద్ద ముగిసింది. అయితే ఈ లాభం ధోరణి తాత్కాలికమేనని రూపాయి భారీగా బలపడిపోయే పరిస్థితి లేదన్నది నిపుణుల అభిప్రాయం. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, ఈక్విటీల బలహీనత, ద్రవ్యోల్బణం, కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్, అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల నిర్ణయాల వంటి సవాళ్లు రూపాయికి ప్రతికూలమని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. రూపాయి మంగళవారం ముగింపు 74.58. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 74.70 కనిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది.

ఇంట్రాడేలో 74.32 గరిష్ట స్థాయిని చూసింది. ఈ వార్త రాస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో  డాలర్‌ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.36 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ప్రాతిపదకన లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌ స్థిరంగా 95.52 వద్ద ట్రేడవుతోంది.  రూపాయికి ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ). 

మరిన్ని వార్తలు