రూపాయి మళ్లీ రివర్స్‌గేర్‌..

23 Apr, 2022 08:52 IST|Sakshi

డాలర్‌ మారకంలో 76.42కు డౌన్‌  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 25 పైసలు నష్టపోయింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 76.42 వద్ద ముగిసింది. వరుసగా నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో నష్టాల్లో నడిచిన రూపాయి, బుధ, గురు వారాల్లో కొంత తేరుకుని 33 పైసలు లాభపడింది. అయితే మళ్లీ మూడవరోజు యథాపూర్వం నష్టాలోకి జారింది. దేశం నుంచి విదేశీ మారకపు నిల్వలు వెనక్కు మళ్లడం, డాలర్‌ ఇండెక్స్‌ (101) 25 నెలల గరిష్ట స్థాయికి చేరడం, మేలో జరిగిన ఫెడ్‌ ఫండ్‌ సమీక్షలో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ 50 బేసిస్‌ పాయింట్ల (ప్రస్తుతం 0.25–0.50 శాతం శ్రేణి) వడ్డీరేటు పెరుగుతుందన్న వార్తలు రూపాయి బలహీనతకు ప్రధాన కారణం. 

డాలర్‌ మారకంలో శుక్రవారం రూపాయి ట్రేడింగ్‌ 76.31 వద్ద రూపాయి ప్రారంభమైంది. 76.19 గరిష్ట–76.50 కనిష్ట స్థాయిల్లో తిరిగింది.   రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి మారకం విలువ మార్చి 8వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్టం 77.05 స్థాయిని చూస్తే, ముగింపులో 77గా ఉంది. రూపాయికి ఇవి రెండు చరిత్రాత్మక స్థాయిలు. తాజా అనిశ్చిత పరిస్థితులు రూపాయి బలహీనతకే దారితీస్తాయని నిపుణులు భావిస్తున్నారు.   
చదవండి👉🏼: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా చర్యలు

మరిన్ని వార్తలు