ఆగని రూపాయి ‘రికార్డు’ పతనం

8 Jun, 2022 08:29 IST|Sakshi

12 పైసలు నష్టంతో 77.78కి డౌన్‌

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక  పతనం కొనసాగుతోంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో మంగళవారం 12 పైసలు పతనమై 77.78 తాజా లైఫ్‌ టైమ్‌ బలహీనతను చూసింది. దేశీయ ఈక్విటీల బలహీన ధోరణి, అంతర్జాతీయంగా డాలర్‌ పటిష్టత దీనికి ప్రధాన కారణం. విదేశీ నిధులు వెనక్కుపోవడం, తీవ్ర స్థాయిల్లో గ్లోబల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు దేశీయ కరెన్సీపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. సోమవారం రూపాయి ముగింపు 77.66. మంగళవారం ట్రేడింగ్‌లో మరింత బలహీనంగా 77.72 వద్ద ప్రారంభమైంది. 77.69 వరకూ ఇంట్రాడేలో బలపడినా, ఆ స్థాయిలో నిలద్రొక్కుకోలేకపోయింది. ఒక దశలో 77.80కి కూడా పడిపోయింది. చివరకు క్రితం ముగింపుకన్నా 12 పైసలు నష్టంతో 77.78 వద్ద ముగిసింది. దీనితో ఇంట్రాడే, ముగింపు స్థాయిల్లో రూపాయి సరికొత్త ‘బలహీన’ రికార్డులను చూసినట్లయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి 78.05 వరకూ బలహీనపడే అవకాశం ఉందని మోతీలాల్‌ ఓశ్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో ఫారెక్స్, బులియన్‌ విశ్లేషకులు గౌరంగ్‌ సోమయ్య విశ్లేషించారు. 

మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో  డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనంగా 77.80 వద్ద ట్రేడవుతోంది.  ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ప్రాతిపదికన లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌ పటిష్టంగా 102.50 వద్ద ట్రేడవుతోంది. 

చదవండి: భారత జీడీపీ వృద్ధి: వరల్డ్‌ బ్యాంకు షాకింగ్‌ అంచనాలు
 

మరిన్ని వార్తలు