పదవి నుంచి తప్పుకొన్న మీడియా మొఘల్‌ ముర్డోచ్‌.. ఏడు దశాబ్దాల తర్వాత..

21 Sep, 2023 20:41 IST|Sakshi

మీడియా మొఘల్‌గా పేరొందిన రూపర్ట్ ముర్డోచ్‌ (Rupert Murdoch) ఏడు దశాబ్దాల తర్వాత పదవి నుంచి దిగిపోయారు. ఫాక్స్, న్యూస్ కార్ప్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన కుమారుడు లాచ్లాన్ ముర్డోచ్ రెండు కంపెనీలకు తదుపరి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు అమెరికన్‌ న్యూస్‌ ఏజెన్సీ ‘ఏపీ’ నివేదించింది.

92 ఏళ్ల రూపర్ట్‌ ముర్డోచ్‌ రెండు కంపెనీలకు ఎమిరిటస్ చైర్మన్ అవుతారని, లాచ్లాన్ న్యూస్ కార్ప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని, ఫాక్స్ కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గానూ కొనసాగుతారని ‘ఫాక్స్’ సంస్థ పేర్కొంది. 

రూపర్ట్‌ ముర్డోచ్‌ ఎమెరిటస్‌ ఛైర్మన్‌గా కొనసాగనుండటం సంతోషంగా ఉందని, ఆయన విలువైన సలహాలు రెండు కంపెనీలకు కొనసాగుతాయని లాచ్లాన్ ముర్డోచ్‌ పేర్కొన్నారు. తనలాగే కంపెనీలు కూడా దృఢమైన ఆరోగ్యంతో ఉన్నాయని ‘ఫాక్స్’ ఉద్యోగులను ఉద్దేశిస్తూ రూపెర్ట్ మర్డోచ్ పేర్కొన్నట్లు తమకు లభించిన లేఖను ఉటంకిస్తూ రాయిటర్స్‌ నివేదించింది. 

ఫాక్స్, న్యూస్ కార్ప్‌లను విలీనం చేయడం ద్వారా తన మీడియా సామ్రాజ్యాన్ని మళ్లీ ఏకం చేసే ప్రణాళికను విరమించుకున్న కొన్ని నెలల్లోనే ముర్డోచ్‌ పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. ఫాక్స్ న్యూస్‌తో పాటు ABC, CBS, NBC వార్తా సంస్థలకు పోటీగా మొదటి ప్రసార నెట్‌వర్క్‌ను ముర్డోచ్‌ ప్రారంభించారు. అంతేకాదు రూపర్ట్ ముర్డోచ్‌.. వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థలకు కూడా యజమానే.

మరిన్ని వార్తలు