Russia Ukraine War: యుద్ధం దెబ్బకు విలవిల్లాడుతున్న రష్యా మార్కెట్‌.. నష్టాలు భరించలేక చివరకు..

2 Mar, 2022 13:05 IST|Sakshi

నాటోలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఉక్రెయిన్‌పై దాడి మొదలెట్టిన రష్యాకు వారం రోజుల్లోనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. యుద్ధం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ భీరాలు పలుకుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో విధంగా ఉంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలు విధిస్తున్న ఆంక్షలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతున్నాయి.

ఆంక్షల ఒత్తిడి
యుద్ధం మొదలైన వెంటనే అమెరికా మొదలు కెనడా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీలతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. అంతర్జాతీయ బ్యాంకులు తమ సేవలు నిలిపేస్తున్నట్టు ప్రకటించాయి. ఆఖరికి అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్‌ నుంచి కూడా రష్యాను పక్కకు తప్పించారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న రష్యన్‌ డాలర్లను జప్తు చేశారు. 

స్టాక్‌ మార్కెట్‌ క్లోజ్‌
ఒక్కసారిగా వచ్చిపడ్డ ఆంక్షలతో రష్యన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసిన పెట్టుబడిదారులు కంగారు పడిపోతున్నారు. మార్కెట్‌ నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు తొందరపడుతున్నారు. దీంతో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పటికే రష్యా మార్కెట్‌ ప్రధాన సూచీలు 30 శాతంత మేర క్షీణించాయి. ఇదే ఒరవడి కొనసాగితే మార్కెట్‌ సంపద మొత్తం గుల్లగా మారి ఆర్థిత వ్యవస్థ మరింతగా ఒత్తిడిలోనవుతుందనే భయాలతో సోమ, మంగళ, బుధవారాల్లో తమ స్టాక్‌ మార్కెట్లను మూసేంది రష్యా.

రూబల్‌ పతనం
రష్యా తన స్టాక్‌మార్కెట్లను మూసేసినప్పటికీ నష్టాల పరంపరకు అడ్డుకట్ట పడలేదు. వివిధ దేశాల్లో ఉన్న రష్యన్‌ స్టాక్స్‌ వాల్యూ కూడా ఢమాల్‌ అంటోంది. వివిధ మార్కెట్లలో ఉన్న ఎక్సేంజ్‌ ట్రేడ్‌ ఫండ్‌ (ఏటీఎఫ్‌) వాల్యూలకు కోత పడుతోంది. డాలర్‌తో 101 రూబుల్స్‌, యూరో కరెన్సీతో 112 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. యుద్ధానికి ముందు రూబల్‌ మారక విలువ డాలర్‌తో పోల్చితే 75 రూబల్స్‌గా ఉంది. దీంతో రూబుల్‌ విలువ పతనం అడ్డుకునేందుకు విదేశీ కరెన్సీ ఎక్సేంజీపై ఆంక్షలు విధించింది రష్యా ప్రభుత్వం. మరోవైపు ఆంక్షల ఎఫెక్ట్‌తో రష్యా దగ్గర నిల్వ ఉన్న 600 బిలియన్‌ డాలర్లు మారక కరెన్సీ కూడా కొరగాకుండా పోతుంది.

ఇండియా వైపు 
ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేకపోవడం, అక్కడ పెట్టుబడులకు గ్యారెంటీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. ముఖ్యంగా రష్య మార్కెట్‌పై ఫోకస్‌ చేసిన ఇన్వెస్టర్లకు ఇప్పుడు తక్షణ ప్రత్యామ్నయంగా ఇండియా కనిపిస్తోందని మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌ (ఎంఎస్‌సీఐ) అంచనా వేస్తోంది.

చైనా వద్దు
ఎంఎస్‌సీఐ ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌మార్కెట్‌ సూచీలను అనుసరించి ఇండెక్స్‌ రూపొందిస్తుంది. ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌ సూచీలో చైనా, తైవాన్‌ల తర్వాత ఇండియాకే వెయిటేజీ ఎక్కువగా ఉంది. తైవాన్‌, చైనాల మధ్య కూడా ఘర్షణ పూరిత వాతవరణం ఉండటంతో ఇండియానే బెస్ట్‌ ఆప్షన్‌గా ఇన్వెస్టర్లు చూస్తున్నట్టు ఎంఎస్‌సీఐ అభిప్రాయపడింది.

కోలుకోలేదు
యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతుండటం రష్యా పాలకులకు ఇబ్బందిగా మారింది. సాధ్యమైనంత త్వరగా చర్చల ప్రకియ ద్వారా సానుకూల ఫలితాలు రాబట్టాలనే ఒత్తిడి పెరుగుతోంది. యుద్ధం ఆగితేనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం సాధ్యమవుతుంది. ఇదే తీరుగా యుద్ధం మరింత కాలం కొనసాగితే ఆయుధాల వల్ల జరగని నష్టం ఆర్థిక వ్యవస్థ వల్ల రష్యాకు జరిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత పరిస్థితి నిప్పుల మీద నడకలా మారింది రష్యాకి. యుద్ధం త్వరగా ఆగిపోవాలని రష్యానే బలంగా కోరుకునే పరిస్థితి దాపురించిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అందువల్లే యుద్ధం ప్రారంభంలో ఎక్కువగా మౌనానికే పరిమితమై యూఎస్‌ ఇటీవల గొంతు పెంచిందనే విషయం గుర్తు చేస్తున్నారు.

చదవండి: Russia: ఆర్థిక ఆంక్షలు.. ‍ప్రభావితమయ్యే రష్యన్‌ కుబేరులు

మరిన్ని వార్తలు