గూగుల్‌కు రష్యా భారీ షాక్‌..మేం చెప్పినట్లు చేయాల్సిందే,లేదంటే!

26 Jul, 2022 21:11 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌కు రష్యా భారీ షాకిచ్చింది. వీడియో హోస్టింగ్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసినందుకు రష్యా కాంపిటీషన్‌ వాచ్‌డాగ్ గూగుల్‌కు 34.2 మిలియన్ డాలర్లు జరిమానా విధించింది.

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దిగ్గజ సంస్థలు సైతం రష్యాలో తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తే..మరికొన్ని కంపెనీలు పరిమితంగా సేవల్ని కొనసాగిస్తున్నాయి. ఈ తరుణంలో తమతో విభేదించిన దేశాలు, సంస్థలపై రష్యా కఠినంగా ప్రవర్తిస‍్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి తమ కార్యకలాపాల్ని 2024లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటన మరువక ముందే టెక్‌ దిగ్గజం గూగుల్‌కు ఫైన్‌ విధించింది.  

యూట్యూబ్‌ ఆదిపత్యం
రష్యా ఫెడరల్ యాంటీమోనోపోలీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌ఏ) స్పష్టమైన వివరాల్ని వెల్లడించే ప్రయత్నం చేయకుండా యూట్యూబ్‌ వీడియో హోస్టింగ్‌ సేవల మార్కెట్‌లో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసింది.అందుకే ఫైన్‌ విధించినట్లు తెలిపిన ఎఫ్‌ఎస్‌ఏ..తమ ఆదేశాలు అమల్లోకి వచ్చిన 2నెలల లోపు గూగుల్‌ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 

గూగుల్‌పై ఉక్రెయిన్‌ ఎఫెక్ట్‌ 
ఇటీవలి కాలంలో గూగుల్‌పై రష్యా కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ వస్తుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించిన 'నకిలీ వార్తల్ని' తొలగించాలని గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది. కానీ గూగుల్‌ మాత్రం ఆ కంటెంట్‌ను తొలగించలేదు. దీంతో గూగుల్‌ 21.1 బిలియన్ రూబెల్స్‌  ($358.7 మిలియన్లు) చెల్లించాలని గత వారం రష్యా కోర్టు గూగుల్‌ను ఆదేశించింది.

మరిన్ని వార్తలు