Russia-Ukraine war: యూరప్‌ ఆర్థికం.. అస్తవ్యస్తం

30 Apr, 2022 00:32 IST|Sakshi

రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలతో ఎగిసిన ఇంధన ధరలు

19 దేశాల్లో రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం

ఎకానమీల రికవరీకి మరిన్ని కష్టాలు

బ్రసెల్స్‌: ఉక్రెయిన్‌–రష్యాల మధ్య ఉద్రిక్తతలతో యూరప్‌ దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. యుద్ధ ప్రభావాలతో ఇంధనాల రేట్లు ఎగిసిన నేపథ్యంలో.. ఉమ్మడి కరెన్సీగా యూరోను ఉపయోగించే 19 దేశాల్లో ధరల పెరుగుదల ఏప్రిల్‌లో మరో రికార్డు స్థాయికి చేరింది. మార్చిలో ద్రవ్యోల్బణం 7.4 శాతంగా ఉండగా.. తాజాగా ఏప్రిల్‌లో ఇది 7.5 శాతానికి చేరింది. దీంతో యూరోజోన్‌లో వరుసగా ఆరో నెలా కొత్త రికార్డు స్థాయి నమోదైనట్లయింది. ఫలితంగా కరోనావైరస్‌ మహమ్మారి నుంచి బైటపడే అవకాశాలపై తీవ్ర ప్రభావాలు పడతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. యూరోజోన్‌ దేశాల్లో 34.3 కోట్ల మంది పైగా ప్రజలు ఉన్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని రికార్డు స్థాయికి ఎగదోసిన అంశాలే ప్రస్తుతం యూరోజోన్‌లో ధరల పెరుగుదలకు కారణమని పరిశీలకులు తెలిపారు.  

ఇంధన ధరలు 38 శాతం అప్‌..
ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఇంధన ధరలు 38 శాతం పెరిగాయని యూరోస్టాట్‌ వెల్లడించింది. యుద్ధ ప్రభావంతో ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతి దేశాల్లో ఒకటైన రష్యా నుంచి చమురు, గ్యాస్‌ సరఫరాల్లో ఆటంకాలు ఏర్పడతాయన్న ఆందోళనల కారణంగా ఈ రెండు ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చమురు ఎగుమతి దేశాలు, రష్యా సహా వాటి అనుబంధ
దేశాలు.. ఉత్పత్తిని పెంచే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుండటంతో సమస్య మరింత జటిలం అవుతోంది. ఇక ముడి సరుకులు, విడిభాగాల సరఫరాలో అవరోధాలు దీన్ని ఇంకా తీవ్రం చేస్తున్నాయి. ప్రజలు, ప్రభుత్వాలకు ద్రవ్యోల్బణం సెగ గట్టిగానే తగులుతోంది.  భవిష్యత్తుపై దీనిపై తీవ్ర ఆందోళన నెలకొంది.

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..
ఇంధన అవసరాల కోసం రష్యా మీద ఆధారపడిన యూరప్‌ దేశాల పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది. ఉక్రెయిన్‌ మీద దాడికి దిగిన రష్యా మీద రాజకీయ అవసరాల రీత్యా పోటాపోటీగా ఆంక్షలు ప్రకటించక తప్పడం లేదు. కానీ వాటిని పాటించే పరిస్థి తి లేదు. తమ తమ దేశాల్లో హీటింగ్, విద్యు త్, ఇంధన అవసరాల రీత్యా రష్యా నుంచి ఇంధన దిగుమతులను రద్దు చేసుకునే పరిస్థితుల్లో అవి లేవు. ఇలా రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మొత్తం మీద యూరోజోన్‌ ఆర్థిక రికవరీకి తీవ్ర విఘాతం కలిగించేదిగా మారిందని ఫిచ్‌ రేటింగ్స్‌ ఎకనమిక్స్‌ టీమ్‌ డైరెక్టర్‌ తేజ్‌ పారిఖ్‌ అభిప్రాయపడ్డారు. అటు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచాలని యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.

కానీ ధరలను అదుపు చేసేందుకు రేట్లు పెంచితే .. కోవిడ్, ఇంధన కొరత, యుద్ధం వంటి దెబ్బల నుంచి ఎకానమీలు కోలుకోవడానికి విఘాతం కలుగుతుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు విధించిన ఆంక్షలతో 2021 తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 0.3% నుంచి 0.2%కి మందగించడం వీటికి మరింత ఊతమిస్తున్నాయి. తొలి త్రైమాసికం మధ్యలో మొదలైన యుద్ధ (ఫిబ్రవరి 24) ప్రభావాలు రానున్న నెలల్లో కూడా కనిపిస్తాయని విశ్లేషకులు తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌ యుద్ధ ఫలితాలతో రెండో త్రైమాసికంలో యూరోజోన్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మంద గించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం ఎగియడాన్ని చూస్తే జూలైలో ఈసీబీ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు.  

మరిన్ని వార్తలు