Russia-Ukraine: భారత్‌పై కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు..!

27 Feb, 2022 19:49 IST|Sakshi

ప్రముఖ కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్ రష్యా - ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘర్షణ ఒక దేశానికి సంబంధించిన భౌగోళిక విషయాలను హైలైట్ చేస్తుంది అని అన్నారు. భారతదేశం 'ఆత్మనీర్భర్' లేదా స్వావలంబనగా మారాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. సైనిక సామగ్రి కోసం రష్యాపై భారతదేశం ఆధారపడటంతో ఉదయ్ కోటక్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

"అణు సామర్ధ్యం కలిగిన చైనా, వైపు పాకిస్తాన్ దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రష్యన్ సైనిక పరికరాలపై మనం ఆధారపడటం శ్రేయస్కరం కాదు, అలాగే, మనకు అమెరికా చాలా దూరంలో ఉంది. కాబట్టి ప్రస్తుతం మనకు అనేక సవాళ్లు ఉన్నాయి. ఈ యుద్ధం ఖచ్చితంగా ఒక బోధించే విషయం: ఆత్మనీర్భర్ భారత్'గా మారాల్సిన సమయం అని!" కోటక్ తన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. భారతదేశానికి అతిపెద్ద ఆయుధ సరఫరాదారులో రష్యా ఒకటి. గత ఏడాది డిసెంబర్ నెలలో భారత్, రష్యా మధ్య రక్షణ సహకారం కోసం నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి.

ఇటీవలే ఏకంగా రూ.35,000 కోట్ల విలువైన ఎస్‌-400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి సమకూర్చుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌గా పేరున్న ఎస్‌-400 డీల్‌ను అమెరికా అభ్యంతరాలను తోసిరాజని మరీ ఓకే చేసుకుంది. దాంతోపాటు 6.1 లక్షల అత్యాధునిక ఏకే-203 అసాల్ట్‌ రైఫిళ్ల తయారీ ఒప్పందం కూడా ఇరు దేశాల మధ్య కుదిరింది. దీని విలువ రూ.5 వేల కోట్ల పైచిలుకే. రష్యాతో కలిసి యూపీలోని అమేథీ ఫ్యాక్టరీలో ఈ రైఫిళ్లను తయారు చేస్తారు. 

(చదవండి: ఉక్రెయిన్‌ నుంచి మనవాళ్లు రావాలంటే.. ఇంత ఖర్చు అవుతుందా?)

మరిన్ని వార్తలు