అటు బాంబుల మోత.. ఇటు బంగారం, ఫ్యూయల్‌ ధరల వాత

24 Feb, 2022 11:07 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైంది బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ యుద్ధంలో ప్రపంచంలో శక్తివంతమైన యూరప్‌ దేశాలు, అమెరికాలతో ముడిపడి ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లు అతాలకుతలం అవుతున్నాయి. ఇప్పటికే కోవిడ్‌ ఎఫెక్ట్‌తో రెండేళ్లుగా మందగించిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ తరుణంలో రష్యా మొదలుపెట్టిన యుద్ధం మార్కెట్‌కు చేటు తెచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగిస్తున్న బాంబులు, రాకెట్లు, తుటాల ఎఫెక్ట్‌ చమురు, బంగారం ధరలపై నేరుగా కనిపిస్తుంది.

బంగారం 30 శాతం
క్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైందన వార్తలు రావడం. అందుకు సంబంధించిన వీడియోలు అన్ని న్యూస్‌ ఛానళ్లలో ప్రసారం అవుతుండటంతో మార్కెట్‌ షేక్‌ అయ్యింది. బంగారం ధరలు ఒక్క రోజు వ్యవధిలోనే 30 శాతం పెరిగాయి. బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర  గ్రాముకి రూ. 850 పెరిగింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర  గ్రాముకి రూ. 930లు పెరిగింది. 2022 ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటల సమయంలో ఆభరణాల తయారీలో ఉపయోగించే బంగారం తులం ధర రూ. 46,850 దగ్గర ట్రేడవుతుండగా స్వచ్ఛమైన బంగారం తులం ధర రూ.51,100లుగా ఉంది.

సెంచరీని తాకింది
గత మూడు నాలుగు రోజులుగా 97 , 98 డాలర్ల దగ్గర అటు ఇటు ఊగిసలాడుతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధర యుద్ధం మొదలు కాగానే 2022 ఫిబ్రవరి 24 ఉదయం వంద డాలర్ల ( 99.72)  డాలర్లకు చేరుకుంది. యుద్ధ తీవ్రత మరింతగా కొనసాగి.. అటు ఆంక్షలు కూడా పెరిగితే ముడి చమురు ధరలకు కళ్లెం వేయడం అసాధ్యమయ్యే పరిస్థితి ఎదురు కానుంది. 

వాత తప్పదా?
2014లో ముడి చమురు బ్యారెల్‌ ధర 100 డాలర్లకు పైన నమోదు అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. కోవిడ్‌ సంక్షోభంలో ఎదురైన నష్టాలు పూడ్చుకునేందుకు చమురు ఉత్పత్తి దేశాలు అవలంభించిన వ్యూహంతో నిన్నా మొన్నటి వరకు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టు రష్యా దండయాత్రతో పరిస్థితి మరింత ఘోరంగా మారనుంది. బ్యారెల్‌  క్రూడ్‌ ఆయిల్‌ ధర వంద డాలర్లు దాటితే మన దగ్గర లీటరు పెట్రోలు, డీజిల్‌ల ధర కనిష్టంగా రూ.7 నుంచి 8  వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

చదవండి: ఉక్రెయిన్‌లో బాంబుల మోత.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ల సూచీలు

మరిన్ని వార్తలు