India-Russia: అమెరికా,యూరప్‌ దేశాలకు రష్యా భారీ షాక్‌..భారత్‌లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు సన్నాహాలు!

24 Apr, 2022 15:07 IST|Sakshi

తమతో ఖయ్యానికి కాలు దువ్వుతున్న దేశాలకు రష్యా భారీ షాకివ్వనుంది. ఓ వైపు యుద్ధం కొనసాగిస్తూనే..పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షల్ని తట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా అమెరికాతో పాటు యూరేపియన్‌ దేశాలకు చెక్‌ పెడుతూ..రష్యా..భారత్‌లో భారీ ఎత్తున ఐటీ సంస్థల్ని ఏర్పాటు చేయనుంది.

ఉక్రెయిన్‌ పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును తప్పుబడుతూ ఇప్పటి వరకు 400 దిగ్గజ కంపెనీలు ఆ దేశంలో కార్యకలాపాల్ని నిలిపివేసినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. యుద్ధం కారణంగా 2లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని మాస్కో మేయర్‌ ప్రకటించారు. అయినా రష్యా యుద్ధ మంత్రాన్నే జపిస్తోంది. అదే సమయంలో భారత్‌తో స‍్నేహం తమకు లాభిస్తోందని రష్యా భావిస్తుంది. అందుకే భారత్‌తో పాటు బ్రిక్స్‌ దేశాల భాగస్వామ్యంలో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయనుంది. 

261ఐటీ కంపెనీలకు అధిపతి
రష్యాలో సెయింట్‌ పీటర్‌ బర్గ్‌ కేంద్రంగా రస్‌ సాఫ్ట్‌ అనే సంస్థ 261 ఐటీ కంపెనీలకు, అందులో పనిచేస్తున్న 85వేల మంది ఉద్యోగులకు నాయకత్వం వహిస్తుంది. ఈ రస్‌ సాఫ్ట్‌ సంస్థ అధ్యక్షుడు వాలెంటిన్ మకరోవ్ మాట్లాడుతూ.. ఇటీవల భారత్‌లో జరిగిన బెంగాల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌(బీజీబీఎస్‌)కు రష్యాకు చెందిన  ఐటీ సంస్థలు.. భారత్‌కు చెందిన పలు ఐటీ సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. 

మేం నమ్ముతున్నాం
అమెరికా,యూరప్‌ దేశాలు రష్యాపై విధిస్తున్న ఆంక్షల కారణంగా అనేక సవాళ్లతో పాటు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఆ ఇబ్బందుల వల్లే వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే అవకాశాల్ని అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నామని మకరోవ్ చెప్పారు. కాబట్టి, బ్రిక్స్ దేశాలతో పాటు ఐటీ రంగంలో అగ్రగామిగా అడుగులు వేస్తున్న భారత్ లో సంస్థల్ని నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు రస్‌సాఫ్ట్‌ ప్రతినిధి పీటీఐ చెప్పారు.

“గత కొన్ని రోజులుగా, మా(రస్‌సాఫ్ట్‌) ప్రతినిధి బృందం అనేక భారతీయ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యింది. తమ భాగస్వామ్యంలో ఇక్కడ(భారత్‌లో)  సంస్థల్ని ఏర్పాటు చేసేందుకు భారత్‌కు చెందిన 19 సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ , టెలిమెడిసిన్, డిజిటల్ గవర్నెన్స్‌ వంటి రంగాల్లో సేవలందించే సంస్థలు ఎక్కువగా ఉన్నట్లు రస్‌ సాఫ్ట్‌ సహా మా నైపుణ్యాన్ని అందించగల అనేక రంగాలు ఉన్నాయి, ”అని రస్‌ సాఫ్ట్‌ అధ్యక్షుడు వాలెంటిన్ మకరోవ్ వెల్లడించారు. 

బీజీబీఎస్‌ ఓ మంచి అవకాశం
రస్‌ సాఫ్ట్‌ ప్రతినిధి బృందం, భారతీయ కంపెనీల మధ్య సత్సంబంధాలు నెరిపేందుకు బీజీబీఎస్‌ సులభతరం చేసిందని మకరోవ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.  రష్యన్ ఐటీ కంపెనీలు సాంకేతిక నైపుణ్యంతో భారతీయ సంస్థలను ఎలా పెంచవచ్చో వివరించామన్నారు. పన్నులో రాయితీ ఇస్తూ ఆర్టీపీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని అందుబాటులో తీసుకొని రావడం, సాఫ్ట్‌వేర్ ద్వారా ట్రాఫిక్ మూవ్‌మెంట్స్‌ను ఆప్టిమైజ్ చేయడం, విద్యుత్ వినియోగాన్ని పొదుపు చేయడం, లాజిస్టిక్స్ కోసం సమాచార వ్యవస్థలపై పని చేయడంలో చాలా అవకాశాలు ఉన్నాయని మకరోవ్ చెప్పారు.

పెద్దన్నతో భారత్‌ ఢీ  
అమెరికాతో పోటీపడే స్థాయికి భారత్ అడుగులు వేస్తుందని మకరోవ్‌ పేర్కొన్నారు. అయితే తయారీ నాణ్యతలో మెరుగులైన ఫలితాల్ని సాధించే అవకాశం ఉందని అన్నారు. “ప్రపంచ మార్కెట్‌లో ఇతర దేశాలకు గట్టి పోటీ ఇచ్చేలా భారత్‌కు సహాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. దాని కోసం కొత్త సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానాన్ని అందుబాటులో తేవాలంటే భారతీయ మానవ వనరులను పొందడం మాకు అవసరం. కలిసి ఉత్పత్తులన్ని తయారు చేయడం, ఇక్కడ, విదేశాలలో విక్రయించడం మా లక్ష్యం, ”అని మకరోవ్ స్పం చేశారు. ఇక అంతర్జాతీయ వాణిజ్యం కోసం అమెరికన్‌ డాలర్‌పై ఆధారపడకుండా ఉండటానికి డిజిటల్ కరెన్సీ, రూపాయి-రూబుల్ చెల్లింపు వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తామని మకరోవ్‌ పునరుద్ఘాటించారు. 

చదవండి👉పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న దిగ్గజ ఐటీ కంపెనీలు..బాబోయ్‌ వద‍్దంటున్న ఉద్యోగులు!

మరిన్ని వార్తలు