వృద్ధి రేటు 7.3 శాతానికి తగ్గింపు

19 May, 2022 01:21 IST|Sakshi

ఎస్‌అండ్‌పీ నిర్ణయం

ద్రవ్యోల్బణం రిస్క్‌ ప్రభావం...

న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో 7.8 శాతంగా ఉంటుందన్న గత అంచనాను 7.3 శాతానికి సవరించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం అంచనాల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతుండడాన్ని పరిగణనలోకి తీసుకుని తాజా అంచనాలను ప్రకటించింది. ద్రవ్యోల్బణం దీర్ఘకాలం పాటు గరిష్టాల్లో ఉండడం ఆందోళనకరమని ఈ సంస్థ వ్యాఖ్యానించింది.

దీనివల్ల సెంట్రల్‌ బ్యాంకులు ఇప్పటి కంటే మరింత అధికంగా రేట్లను పెంచాల్సి వస్తుందని పేర్కొంది. ఇది ఉత్పత్తిపై, ఉపాధి కల్పనపై ప్రభావం చూపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎస్‌అండ్‌పీ చివరిగా 2021 డిసెంబర్‌లో భారత్‌ వృద్ధి అంచనాలను ప్రకటించింది. 2022–23 సంవత్సరానికి 7.8 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనాలు వ్యక్తీకరించింది. కానీ, అప్పటికి ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉండగా, రష్యా–ఉక్రెయిన్‌ సంక్షోభం కూడా లేదు. ముఖ్యంగా గత మూడు నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోవడం తెలిసిందే.  

2023–24లో 6.5 శాతం
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతంగా ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది. ‘‘చివరిసారి మా వృద్ధి అంచనాల తర్వాత రిస్క్‌లు పెరిగిపోయాయి. రష్యా–ఉక్రెయిన్‌ వివాదం వృద్ధి రేటును కిందకు తీసుకెళుతుంది’’అని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ఇక గడిచిన ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.9 శాతంగా నమోదు కావచ్చని అంచనా. ఈ నెలాఖరులో ఈ గణాంకాలు రానున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.9 శాతం ఉండొచ్చని ఎస్‌అండ్‌పీ తెలిపింది.

మరిన్ని వార్తలు