భారత్‌ ‘సేవలు’ పటిష్టం 

4 May, 2023 01:51 IST|Sakshi

ఏప్రిల్‌లో 13 ఏళ్ల గరిష్ట స్థాయి

62కు ఎస్‌అండ్‌పీ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌  

న్యూఢిల్లీ: భారత్‌ సేవల రంగం ఏప్రిల్‌లో గణనీయమైన ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్విసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 13 నెలల గరిష్ట స్థాయిలో 62కు ఎగసింది. మార్చిలో సూచీ 57.8 వద్ద ఉంది. కొత్త వ్యాపారాల్లో వృద్ధి, మార్కెట్‌ పరిస్థితుల సానుకూల వంటి అంశాలు ఈ పటిష్ట ఫలితానికి కారణమని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కిట్‌ ఇంటెలిజెన్స్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు.

నిజానికి ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా,  ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సేవల సూచీ గడచిన 21 నెలల్లో వృద్ధి శ్రేణిలోనే ఉంది. భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవల రంగం మెజారిటీ వాటాను కలిగిఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఇంకా ఉపాధి అవకాశాలు ఈ రంగంలో భారీగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకు సంబంధించిన సర్వే పేర్కొంది. ఇదిలావుండగా, తయారీ, సేవల రంగం రెండూ కలిపిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ కూడా ఏప్రిల్‌లో 61.6గా నమోదయ్యింది. మార్చిలో  సూచీ 58.4 వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు