‘ధరల’ వ్యూహం పరిమిత కాలమే

17 Feb, 2022 01:35 IST|Sakshi

నాలుగో ప్లాంట్‌ దక్షిణాదిన ఏర్పాటు

పీఎల్‌ఐ ఆసరాగా ఎగుమతులు

ఐటెల్‌ సీఈవో అరిజీత్‌ తలపత్ర

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘మొబైల్‌ ఫోన్స్‌ మార్కెట్లో చవక ధరల వ్యూహం ఎంతో కాలం పనిచేయదు.  నిలదొక్కుకోవాలంటే అందుబాటు ధర ఒక్కటే సరిపోదు. నాణ్యమైన ఫీచర్లు, విక్రయానంతర సేవలు ఉండాల్సిందే’ అని ఐటెల్‌ మొబైల్‌ను ప్రమోట్‌ చేస్తున్న ట్రాన్సియన్‌ ఇండియా సీఈవో అరిజీత్‌ తలపత్ర తెలిపారు. మార్కెట్‌ను అర్థం చేసుకోకపోతే మొబైల్‌ ఫోన్స్‌ రంగంలో బ్రాండ్లకు మనుగడ లేదన్నారు. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాదిలోనే ఫీచర్‌ ఫోన్ల విభాగంలో రెండవ స్థానాన్ని చేజిక్కించుకుని ఇతర బ్రాండ్లకు సవాల్‌ విసిరామన్నారు. సాక్షి బిజినెస్‌ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కెట్‌ తీరుతెన్నులు, కంపెనీ గురించి ఆయన మాటల్లో..

ఆ సెగ్మెంట్లో తొలి స్థానం..
చైనా కేంద్రంగా 2007లో ట్రాన్సియన్‌ ప్రారంభమైంది. ఆఫ్రికా తొలి మార్కెట్‌. సబ్‌ సహారన్‌ ఆఫ్రికాలో 70 శాతం వాటా ట్రాన్సియన్‌దే. ఇక 2016లో భారత్‌లో అడుగు పెట్టే ముందే జనాల్లోకి వెళ్లి సర్వే నిర్వహించాం. వారికి ఏం కావాలో అర్థం చేసుకుని మొబైల్స్‌ను రూపొందించాం. విక్రయాల ప్రారంభానికి ముందే సర్వీస్‌ సెంటర్లను తెరిచాం. భారత్‌లో ఏడాదిలోనే ఫీచర్‌ ఫోన్ల రంగంలో రెండవ స్థానానికి చేరుకున్నాం. రూ.7 వేల లోపు ధరల విభాగంలో ఫీచర్, స్మార్ట్‌ఫోన్లలో అగ్రస్థానంలో నిలిచాం. 8 కోట్ల పైచిలుకు వినియోగదార్లు సొంతమయ్యారు. సీఎంఆర్‌ గణాంకాల ప్రకారం  ఐటెల్‌కు రూ.7 వేలలోపు ధరల విభాగంలో 27 శాతం, మొత్తం మార్కెట్లో 9.2 శాతం వాటా ఉంది. కంపెనీకి 85 శాతం మంది ఆఫ్‌లైన్‌ కస్టమర్లు ఉన్నారు. 1,100 పైగా సర్వీస్‌ కేంద్రాలు ఉన్నాయి.  

కస్టమర్లు 2జీ నుంచి 4జీకి..
దేశంలో ప్రస్తుతం 35 కోట్ల మంది 2జీ సేవలను వినియోగిస్తున్నారు. మాకు ఇదే పెద్ద మార్కెట్‌. వినియోగదార్లు 4జీ వైపు మళ్లేందుకు కృషి చేస్తాం. భవిష్యత్‌లో సాంకేతిక పరిజ్ఞానం ఖరీదు తగ్గితే రూ.10 వేల లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ లభించే అవకాశం ఉంది. కంపెనీకి నోయిడాలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. అమ్మకాలనుబట్టి చూస్తుంటే జూన్‌–జూలై నాటికి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. నాలుగో ప్లాంటు దక్షిణాదిన ఏర్పాటు చేస్తాం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని (పీఎల్‌ఐ) వినియోగించుకుని ఎగుమతులపై దృష్టిసారిస్తాం. మొబైల్స్‌తోపాటు టీవీలు, సౌండ్‌బార్స్, స్మార్ట్‌గ్యాడ్జెట్స్‌ అందుబాటులోకి తెచ్చాం. ఆఫ్రికాలో గృహోపకరణాలను ట్రాన్సియన్‌ విక్రయిస్తోంది. క్రమంగా భారత్‌లోనూ వీటిని పరిచయం చేస్తాం.

మరిన్ని వార్తలు