కరోనా ఎఫెక్ట్‌: డిమాండ్‌ ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవే!

25 Dec, 2021 12:11 IST|Sakshi

కోవిడ్‌–19తో జీవిత బీమా పరిశ్రమ వ్యాపార వ్యూహాల్లో పలు మార్పులు వచ్చాయని తెలిపారు ప్రైవేట్‌ రంగ బీమా సంస్థ బజాజ్‌ అలయంజ్‌ ఎండీ తరుణ్‌ చుగ్‌. కరోనా పరిస్థితుల టర్మ్‌ పాలసీలకు ఆదరణ వచ్చిందని, ఇది ఇకపైనా కొనసాగగలదని ఆయన పేర్కొన్నారు. సులభతర పాలసీలకు డిమాండ్‌ పెరుగుతోందని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. 

బీమా రంగానికి కోవిడ్‌–19 పాఠాలు.. 
ప్రతి కంపెనీ తన వ్యాపార ప్రణాళికలను, కస్టమరుకు చేరువయ్యేందుకు అనుసరించే వ్యూహాలను పునఃసమీక్షించుకునేలా కోవిడ్‌–19 చేసింది. పరిశ్రమ కూడా కొత్త రిస్కులకు వేగంగా అలవాటు పడింది. పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వీసులు, ఉత్పత్తులు, ప్రక్రియలను రూపొందించుకుంది. కస్టమర్లు డిజిటల్‌ విధానానికి అలవాటు పడటంతో సర్వీసులు అందించడానికి కంపెనీలకు కొత్త మార్గం దొరికింది. అలాగే కోవిడ్‌ సంక్షోభంతో జీవిత బీమా పాలసీలు అందించే ప్రయోజనాలు కూడా కొంత పెరిగాయి. బీమాపై అవగాహన స్థాయి పెరగడంతో, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. పాలసీదారులు, సంబంధిత వర్గాలందరికీ సరళమైన, స్పష్టమైన విధంగా వివరాలను అందజేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాము. పాలసీలకు సంబంధించి కొత్త పరిణామాలు, ప్రీమియంలు ఎలా చెల్లించాలి, పత్రాలు ఎలా సమర్పించాలి లాంటి అంశాలన్నింటి గురించి పాలసీదారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం.  

కోవిడ్‌ క్లెయిముల పరిస్థితి .. 
గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత క్లెయిమ్స్‌ సెటిల్మెంట్‌ నిష్పత్తి 98.48 శాతంగా ఉండగా, దాదాపు రూ. 1,374 కోట్ల మేర డెత్‌ క్లెయిమ్స్‌ చెల్లించాము. కోవిడ్‌ క్లెయిముల విషయానికొస్తే.. దాదాపు రూ. 74 కోట్లతో 1,300 క్లెయిములు సెటిల్‌ చేశాం. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రభావం ఎలా ఉండబోతోందనేది అంచనా వేయాలంటే ముందుగా దాని తీవ్రత అర్థం కావాలి. అంతవరకూ వేచి చూడాల్సి ఉంటుంది. 

ప్రీమియంల పెంపు.. 
భారతదేశంలో టర్మ్‌ ప్లాన్ల ప్రీమియంలు.. చాలా కాలంగా ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. అయితే, కోవిడ్‌ క్లెయిములు పెరుగుతున్న నేపథ్యంలో ప్రీమియంలను కూడా సవరించడం తార్కికంగా సహేతుకమైనదిగానే భావించక తప్పదు. పైగా రీఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా తమ రేట్లు పెంచేశాయి. దీనితో జీవిత బీమా కంపెనీలు దానికి అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో ప్రీమియంలలో కొంత సవరణలకు అవకాశం ఉన్నప్పటికీ .. మరీ ఎక్కువ భారం మోపకుండా, ఒక మోస్తరు స్థాయిలోనే ఉండగలవు. 

డిమాండ్‌ ఉన్న పథకాలు.. 
జీవిత బీమా పాలసీలను ఇప్పటిదాకా మేము ప్రత్యేకంగా విక్రయించాల్సి వచ్చేది. అయితే, మహమ్మారి నేపథ్యంలో పాలసీదారులు ఇప్పుడు వాటిని అడిగి మరీ తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌ తొలి నాళ్లలో టర్మ్‌ ప్లాన్లకు ఆదరణ బాగా పెరిగింది. ఇదే ధోరణి మరికొన్నాళ్ల పాటు కొనసాగగలదని భావిస్తున్నాము. అలాగే యాన్యుటీ, గ్యారంటీ రిటర్న్‌ ప్లాన్లకు కూడా డిమాండ్‌ ఉంటోంది. కస్టమర్లు పూర్తి అవగాహనతో తగిన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడగలిగేలా ఉండే సరళతరమైన, సులభంగా అర్థం చేసుకోగలిగే సాధనాలు, సమాచారాన్ని కోరుకుంటున్నారు. ఉదాహరణకు వేగవంతమైన ప్రాసెసింగ్, అత్యంత సులభంగా అర్థం చేసుకోగలిగేదిగాను, వైద్య పరీక్షలు అవసరం లేకుండా ఉండేలా మేము ప్రవేశపెట్టిన గ్యారంటీడ్‌ పెన్షన్‌ గోల్‌ (జీపీజీ)కి కస్టమర్ల నుంచి చాలా చక్కని స్పందన వస్తోంది. 

కొత్త పాలసీలు ..  
ఇటీవలే బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ అష్యూర్డ్‌ వెల్త్‌ గోల్‌ పేరిట కొత్త ప్లాన్‌ ఆవిష్కరించాం. పాలసీదారులు దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలను సాధించడంలో తోడ్పడేలా 100 శాతం గ్యారంటీతో, 30 ఏళ్ల వరకూ పన్ను రహిత ఆదాయాన్ని అందించేలా దీన్ని రూపొందించాం. అందుకునే ఆదాయం మధ్య మధ్యలో కొంత కొంతగా పెరిగే విధంగా ఇందులో స్టెప్‌–అప్‌ ఫీచర్‌ కూడా ఉంది. ఈ వేరియంట్‌లో ప్రీమియం చెల్లింపు వ్యవధి పూర్తయిన తర్వాత పర్తీ అయిదేళ్లకోసారి ఆదాయం 10 శాతం మేర పెరుగుతుంది. ఆదాయం చెల్లింపు వ్యవధి పూర్తయిన తర్వాత, కస్టమరు చెల్లించిన ప్రీమియంలన్నీ కూడా వెనక్కి తిరిగి వస్తుంది. పెరిగిపోతున్న వ్యయాలతో అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరి ఆర్థిక పోర్ట్‌ఫోలియోలో ఒక్కటైనా గ్యారంటీ ఆదాయం అందించే సాధనం ఉండటం ఎంతో శ్రేయస్కరం.

మరిన్ని వార్తలు