కారు.. పల్లె‘టూరు’!

11 Dec, 2020 01:07 IST|Sakshi

ఆర్థిక మందగమనానికి తోడైన కరోనా 

పట్టణాల్లో పడిపోయిన వాహన విక్రయాలు 

అమ్మకాలు పెంచుకోవడానికి పల్లెలపై కంపెనీల దృష్టి 

మొబైల్‌ షోరూమ్‌ల ఏర్పాటు

ఆకర్షణీయ స్కీమ్‌లు అందుబాటులో 

పుంజుకున్న అమ్మకాలు 

వాహన రంగం కళకళ

కరోనా వైరస్‌ వాహన విక్రయాలను కాటేసింది. అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో దిక్కు తోచని వాహన కంపెనీలు పల్లెబాట పట్టాయి. కరోనా కల్లోలం, ఆర్థిక మందగమనం సెగ పెద్దగా తాకని గ్రామీణ మార్కెట్లు తమను గట్టెక్కిస్తాయని వాహన కంపెనీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఆ ఆశలను గ్రామీణ మార్కెట్లు నెరవేర్చాయి. భవిష్యత్తుపై భరోసానిచ్చాయి. పల్లె మార్కెట్ల దన్నుతో వాహన రంగం పుంజుకుంది. గ్రామీణ మార్కెట్లలో మరింత పుంజుకోవడానికి కంపెనీలు చేసిన, చేస్తున్న ప్రయత్నాలపై ‘సాక్షి బిజినెస్‌’ స్పెషల్‌ స్టోరీ....

కరోనా మహమ్మారి వాహన రంగంపై తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. లాక్‌డౌన్‌ కారణంగా టూ వీలర్లు, కార్ల అమ్మకాలు అసలే జరగలేదు. మే నెలలో ఒక్క యూనిట్‌ కూడా అమ్ముడవ్వలేదు. గత పదేళ్లలో వాహన విక్రయాలకు సంబంధించి అత్యంత అధ్వానమైన నెల ఇదే. లాక్‌డౌన్‌ ఆంక్షలు పాక్షికంగా సడలించిన తర్వాత అమ్మకాలు పెంచుకోవడానికి వాహన కంపెనీలు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాయి. కరోనా కల్లోలం కారణంగా పట్టణ మార్కెట్, పట్టణాల ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమయ్యాయి. అయితే గ్రామాల్లో కరోనా కల్లోలం పెద్దగా లేకపోవడం, గ్రామీణ ఆర్థిక స్థితిగతులపై కరోనా కల్లోలం ప్రభావం స్వల్పంగానే ఉండటంతో వాహన కంపెనీలు అమ్మకాలు పెంచుకోవడానికి పల్లెబాట పట్టాయి. గ్రామీణులను ఆకర్షించడానికి మొబైల్‌ షోరూమ్స్‌ ఏర్పాటు చేశాయి. రూరల్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నాయి.  
 
ఫలించిన ప్రయత్నాలు...
ఆరు నెలల కాలంలో ఈ ప్రయత్నాలు ఫలించాయి. వాహన విక్రయాలు మెల్లమెల్లగా రికవరీ అయ్యాయి. పండుగల సీజన్‌లో బాగా పుంజుకున్నాయి. గ్రామీణ మార్కెట్ల దన్నుతోనే వాహన విక్రయాలు కళకళలాడాయి. వాహన కంపెనీలకు భవిష్యత్తుపై  భరోసాను కూడా గ్రామీణ మార్కెట్లే ఇచ్చాయి. ఇక ఇప్పుడు పట్టణ మార్కెట్లు కూడా మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి.  
 
వెయ్యి కొత్త షోరూమ్‌లు...

ఆర్థిక మందగమనం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండటంతో దాదాపు 300కు పైగా వాహన షోరూమ్‌లు మూతపడ్డాయి. పులి మీద పుట్రలా ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా కల్లోలం కూడా జత అయింది. దీనికి లాక్‌డౌన్‌ ఆంక్షలు తోడయ్యాయి. ఫలితంగా పరిస్థితులు మరింత అస్తవ్యస్తం కావాలి. అంటే మరిన్ని షోరూమ్‌లు మూతపడాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిన తర్వాత వాహన కంపెనీలు కొత్తగా వెయ్యికి పైగా రిటైల్‌ అవుట్‌లెట్స్‌ను ప్రారంభించాయి. వీటిల్లో అధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కావడం విశేషం.  గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెంచుకోవడానికి, కొత్త కొత్త మార్కెటింగ్‌ వ్యూహాలు అమలు చేయడానికి టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలకు ఆయా గ్రూప్‌కంపెనీల తోడ్పాటు ఇతోధికంగా ఉపయోగపడింది. టాటా మోటార్స్‌ కంపెనీ తన ఇతర గ్రూప్‌ కంపెనీలతో కలిసి జాయింట్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజీని అమలు చేసింది. వీటన్నిటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో టాటా మోటార్స్‌ వాటా 5% పెరిగి 43 శాతానికి, మహీంద్రా వాటా 6% పెరిగి 53 శాతానికి చేరాయి.

మొబైల్, చిన్న షోరూమ్‌లు...
టాటా మోటార్స్‌ కంపెనీ మొబైల్‌ షోరూమ్స్‌ను ఏర్పాటు చేసింది. తక్కువ వ్యయాలతోనే వీటిని ఏర్పాటు చేసి, గ్రామీణులకు టెస్ట్‌ డ్రైవ్‌ అవకాశాన్ని కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు వేగంగా విక్రయానంతర సేవలందించే నిమిత్తం వాహన కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్‌ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి.  టాటా మోటార్స్‌ కంపెనీ ఒకడుగు ముందుకు వేసి జిప్‌ సర్వీస్‌ పేరుతో బైక్‌ల ద్వారా ఈ సేవలందిస్తోంది. పట్టణాల్లోని షోరూమ్‌ల్లో నాలుగో వంతు ఉండేలా చిన్న చిన్న షోరూమ్స్‌ను వాహన కంపెనీలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. అమ్మకాలు పుంజుకోవడానికి ఇవి బాగానే తోడ్పడ్డాయి. వాహన కంపెనీలు స్టూడియో స్టోర్స్, షోరూమ్‌ లైట్, ఎమర్జింగ్‌ మార్కెట్‌ అవుట్‌లెట్స్, స్మార్ట్‌ షోరూమ్‌ పేర్లతో చిన్న షోరూమ్‌లను ఏర్పాటు  చేస్తున్నాయి.  కియా కంపెనీ స్మార్ట్‌ అవుట్‌లెట్‌ పేరుతో చిన్ని చిన్న కార్ల షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది.

డిజిటల్‌ జోరు...
కరోనా కల్లోలం కారణంగా ప్రజలు బయటకు రావడం తగ్గింది. దీంతో కార్ల కంపెనీల షోరూమ్స్‌ వెలవెలపోతున్నాయి. దీనిని అధిగమించడానికి హ్యుందాయ్‌ కంపెనీ  ‘క్లిక్‌ టు బై’ పేరుతో డిజిటల్‌ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. కారు కొనుగోలు చేయాలనుకున్న వినియోగదారుడు షోరూమ్‌కు వెళ్లకుండానే క్లిక్‌ టు బై డిజిటల్‌ షోరూమ్‌లో నచ్చిన కారును ఎంచుకొని హోమ్‌ డెలివరీ పొందవచ్చు.   కొత్తగా మన మార్కెట్లోకి వచ్చిన కియా మోటార్స్, ఎమ్‌జీ మోటార్‌ కంపెనీలు డిజిటల్‌ షోరూమ్‌ల ద్వారా  అమ్మకాలు సాగిస్తున్నాయి.

వినూత్నమైన స్కీమ్‌లు...
ఆర్థిక మందగమనం, కరోనా కల్లోలం కారణంగా పట్టణాల్లో వాహన విక్రయాలు కుదేలయ్యాయి. చాలా మంది ఆదాయాలు తగ్గడంతో అమ్మకాల కోసం వాహన కంపెనీలు కొత్త దారులు వెదుకుతున్నాయి.  ఆదాయాలు పడిపోవడంతో చాలామంది వాహనాలు కొనలేకపోతున్నారు. దీన్ని అధిగమించడానికి సబ్‌స్క్రిప్షన్, లేదా లీజు ద్వారా వాహన  వాడకం తదితర ఆకర్షణీయ స్కీమ్‌లను వాహన కంపెనీలు ఆఫర్‌ చేస్తున్నాయి. ఉద్యోగం పోయిన పక్షంలో ఈఎమ్‌ఐల చెల్లింపుల్లో వెసులుబాటును ఇవ్వడం వంటి  వినూత్నమైన స్కీమ్‌లను వాహన కంపెనీలు అందిస్తున్నాయి.

వాహన కంపెనీల పల్లెబాట ఇలా
► మహీంద్రా: ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ డివిజన్‌తో కలసి 475 కొత్త అవుట్‌లెట్స్‌ ఏర్పాటు.
► టాటా మోటార్స్‌: గ్రూప్‌ కంపెనీలతో కలిసి జాయింట్‌ మార్కెటింగ్‌ వ్యూహం అమలు.  
► మారుతీ సుజుకీ: 12,500 రెసిడెంట్‌ డీలర్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ల నియామకం.
► హ్యుందాయ్‌: కొత్త విధానంలో షోరూమ్‌ల ఏర్పాటు, బైక్‌ల ద్వారా విక్రయానంతర సేవలు  అందిస్తోంది.
► కియా మోటార్స్, ఎమ్‌జీ మోటార్‌: డిజిటల్‌ షోరూమ్‌ల ఏర్పాటు, సర్వీసింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత.
► టయోటా కిర్లోస్కర్‌: కొత్తగా వంద సర్వీసింగ్‌ సెంటర్ల ఏర్పాటు.

కొత్త ఏడాదిలో ధరలకు రెక్కలు..!
ముంబై: కొత్త ఏడాదిలో కారు కొనడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారులకు  ఏడాది ప్రారంభంలోనే నిరాశ ఎదురుకానుంది. పలు కార్ల కంపెనీలు జనవరి 1 నుంచి తమ మోడళ్లపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించడం ఇందుకు కారణం. ఆటో రంగంలో తలెత్తిన సంక్షోభంతో పాటు కోవిడ్‌ ప్రేరేపిత లాక్‌డౌన్‌తో 2020లో కార్ల అమ్మకాలు, ఎగుమతులు భారీగా తగ్గిపోవడంతో వాహన కంపెనీలు తప్పనిసరిగా ధరలను పెంచాల్సిన పరిస్థితి నెలకొంది.  

మారుతీ సుజుకీ...: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ‘‘గత ఏడాది కాలంగా కార్ల తయారీ వ్యయాలు పెరుగుతూ వచ్చాయి. అందుకే ఇప్పుడు ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కస్టమర్లు ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది’’ అని కంపెనీ ఎక్చ్సేంజీలకు వివరణ ఇచ్చింది. ధరల పెంపు నిర్ణయం మోడల్‌ ప్రాతిపదికన మారుతుందని మారుతీ సుజుకీ పేర్కొంది.

అదే దారిలో ఫోర్డ్‌ ఇండియా కూడా...
మారుతీ సుజుకీ దారిలోనే ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్‌ ఇండియా కూడా వచ్చే జనవరి 1 నుంచి తన అన్ని రకాల మోడళ్లపై ధరలను ఒకశాతం నుంచి 3% వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఆయా మోడళ్లను బట్టి ఈ పెంపు రూ.5వేల నుంచి రూ. 35 వేలు దాకా ఉండొచ్చని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వినయ్‌ రైనా తెలిపారు. ఇన్‌పుట్‌ వ్యయాల కారణం ధరలను పెంచక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే 2020 ఏడాది ముగిసే లోపు బుకింగ్‌ చేసుకున్న వారికి ఈ ధరల సెగలు తగలవని వినయ్‌ వివరించారు.

మరిన్ని వార్తలు