ఇంటి బడ్జెట్‌: జీవితకాల పొదుపు మొత్తాన్ని కరోనా పట్టుకుపోయింది!

24 May, 2021 03:26 IST|Sakshi

ఐసీయూలో ఇంటి బడ్జెట్‌

కరోనా ఖర్చులను గట్టెక్కేందుకు నానా పాట్లు

స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్, పెట్టుబడుల విక్రయం

రుణాలు తీసుకున్న వారు ఎందరో

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రక్షణ ఉన్నది కొందరికే

36 శాతం మందికే అత్యవసర నిధి

కరోనా నేర్పిన పాఠాలు ఎన్నో

వ్యక్తుల ఆర్థిక ధోరణిలో ‘కరోనా’ మార్పులు

భవిష్యత్తుకు సన్నద్ధమయ్యేందుకు దారి

కరోనా రాక ముందు.. వచ్చిన తర్వాత.. ఇంటి బడ్జెట్, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల విషయంలో ఎక్కువ మంది అంగీకరించే మాట ఇది. పొదుపు, పెట్టుబడులు, వ్యయాల (ఇంటి బడ్జెట్‌) విషయంలో లోపాలను ఈ మహమ్మారి గుర్తు చేయడమే కాదు, వ్యక్తుల నడవడికను మార్చుకోవాల్సిన అవసరాన్ని సైతం తెలియజేసింది. ఆర్థిక విషయాల్లో వ్యక్తుల ఆలోచనా ధోరణిని మార్చడమే కాకుండా, భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో ఆర్థిక పాఠాలను నేర్పింది. ఒక ప్రముఖ సంస్థ ఇదే అంశంపై ఆన్‌లైన్‌లో ఒక సర్వే నిర్వహించింది. కరోనా కారణంగా ఎదురైన భిన్న అనుభవాలు, కష్ట సుఖాలు ఈ సర్వేలో పాలుపంచుకున్న 408 మంది వెల్లడించారు.

ఆ వివరాలు ఈ వారం ‘ప్రాఫిట్‌ ప్లస్‌’లో..
ఒకవైపు ఉద్యోగాల్లోంచి తొలగింపులు, వేతన కోతల కాలం.. మరోవైపు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడితే వారికి మెరుగైన వైద్యం కోసం ఖర్చు పెట్టడం ఇవన్నీ పెద్ద సవాళ్లే. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతీ ఇద్దరిలో ఒకరు ఉద్యోగం కోల్పోయినట్టు లేదా వేతన కట్‌ను ఎదుర్కొన్నట్టు చెప్పడం గమనార్హం. స్వయం ఉపాధిలో ఉన్న వారు సైతం 71 మందిలో 37 మంది ఇదే విధంగా చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో పావు వంతు మంది (సర్వేలో పాల్గొన్న వారిలో)తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ లేదా ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. కొంత మందిపై ఆర్థిక భారం గణనీయంగా పడింది. చెన్నైకు చెందిన మృదుల (సర్వేలో పాల్గొన్న వ్యక్తి) పరిస్థితినే చూస్తే.. ఆమె స్వయం ఉపాధిలో ఉన్న మధ్య వయసు మహిళ.

గతేడాది లాక్‌డౌన్‌తో ఆమె ఆదాయానికి బ్రేక్‌ పడింది. అదే సమయంలో మృదుల తల్లి (78) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. 65 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జ్‌ అయ్యారు. కానీ, చికిత్స కోసం రూ.34 లక్షలు వెచ్చించాల్సి వచ్చింది. ‘‘ఆరంభంలో రోజుకు రూ.40,000 బిల్లు వచ్చింది. వెంటిలేటర్‌ అవసరం ఏర్పడడంతో బిల్లు రూ.లక్షకు వెళ్లిపోయింది. వెంటిలేటర్‌ అవసరం తొలగిపోయిన తర్వాత అమ్మను ఇంటికి తీసుకొచ్చేశాము. ఎందుకంటే ఇక అంతకుమించి ఆస్పత్రి బిల్లు కట్టే పరిస్థితి లేదు’’ అని మృదుల తెలిపారు. మృదుల మాతృమూర్తి ఇప్పటికీ ఇంటి నుంచే చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఆక్సిజన్‌ ఇతర ఔషధాలు, పరీక్షల కోసం నెలవారీగా రూ.1–1.5 లక్షలు ఖర్చువుతోంది.  

ఇతర చిక్కులు/పరిమితులు..?
ఆస్పత్రిలో చేరితే ఎదురయ్యే వైద్య ఖర్చుల భారం ఏ మేరకు ఉంటుందో ముందుగానే అంచనా వేయలేము. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉందన్న భరోసాతో ధైర్యంగా ఉండలేని పరిస్థితులను కరోనా పరిచయం చేసింది. కరోనా బారిన పడిన వారికి నగదు రహిత వైద్య చికిత్సలు అందించేందుకు మొదట్లో చాలా ఆస్పత్రులు ముందుకు రాలేదు. ఆ తర్వాత కూడా కొన్ని ఆస్పత్రుల వైఖరి అలాగే ఉంది. క్లెయిమ్‌లలో జాప్యం, అత్యవసరాలను గట్టెక్కేందుకు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంలో ఎన్నో ఇబ్బందులు పడ్డవారు కూడా ఉన్నారు. వినోదిని ఐటీ ఉద్యోగి. బెంగళూరులో పనిచేస్తున్నారు. ఆమెకు కంపెనీ తరఫున కార్పొరేట్‌ హెల్త్‌ కవరేజీ ఉంది.

కరోనా పాజిటివ్‌గా తేలి ఇంట్లోనే క్వారంటైన్‌ అయ్యారు. ఫోన్‌లో డాక్టర్‌ను సంప్రదించారు. తెలిసిన వారి సాయంతో ఔషధాలు తెప్పించుకున్నారు. ‘‘మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కోసం వైద్యుల ప్రిస్క్రిప్షన్, బిల్లు, టెస్ట్‌ల రిపోర్ట్‌లు సమర్పించాల్సి రావడం అన్నది అసహనానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా అనారోగ్యం పాలైనప్పుడు ఇటువంటి వాటి గురించి ఆలోచించలేరు. దీంతో కొన్ని వేల రూపాయలకు క్లెయిమ్‌ను నేను పొందలేకపోయాను’’ అని వినోదిని తెలిపారు. దీనికి బదులు టెస్టింగ్‌ రిపోర్ట్‌/స్కాన్‌ రిపోర్ట్‌ సమర్పించిన వెంటనే ఆటోమేటిక్‌గా నిర్ణీత మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్‌ కింద అందించే విధంగా నిబంధనలను సడలించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పైగా సీరియస్‌ పరిస్థితుల్లో రోగిని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడం సర్వసాధారణం.

ఇలాంటి పరిస్థితులతోనూ చాలా మంది నగదు రహిత క్లెయిమ్‌ అవకాశాన్ని కోల్పోయారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనే నగదు రహిత చికిత్సలకు అవకాశం ఉంటుందని తెలిసిందే. రీయింబర్స్‌మెంట్‌ చేసుకోవచ్చు.. కానీ, అదేమంత సులభమైన ప్రక్రియ కాదు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్, డిశ్చార్జ్‌ సమ్మరీ, డిటెయిల్డ్‌ బిల్లు, అన్ని టెస్ట్‌ రిపోర్టులు, వైద్యుల ప్రిస్కిప్షన్‌ ఇలా అన్ని డాక్యుమెంట్లు, వాటిపై ఆస్పత్రుల సీల్, సంతకాలతో సేకరించి బీమా సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిల్లో కొన్ని లేకపోయినా మళ్లీ ఆస్పత్రి చుట్టూ తిరిగి వాటిని తీసుకుని సమర్పించాలి. ఇదంతా సమయం, శ్రమతో కూడుకున్న పనే.

వైద్య బీమా కవరేజీ గణణీయంగానే ఉన్నప్పటికీ.. కొన్నింటికి ఉప పరిమితులు ఉంటాయి. దీంతో వాస్తవ బిల్లుతో పోలిస్తే తమకు అందిన మొత్తం తక్కువేనని సర్వేలో పాల్గొన్నవారిలో కొందరు చెప్పారు. మృదుల తల్లిదండ్రులు కాంట్రిబ్యూటరీ హెల్త్‌సర్వీస్‌ స్కీమ్‌లో ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ బీమా పథకం. అయితే, మృదుల తల్లి నాన్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో చేరడంతో.. వాస్తవంగా రూ.34 లక్షల బిల్లు వచ్చినప్పటికీ.. రీయింబర్స్‌మెంట్‌ రూపంలో కేవలం రూ.11లక్షలే అందుకున్నారు. ఇక పెట్టుబడుల విక్రయంలోనూ సమస్యలు ఎదుర్కొన్న వారూ ఉన్నారు.

భాస్కర్‌ కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో ఈపీఎఫ్‌ నిధి నుంచి విత్‌డ్రాయల్‌కు దరఖాస్తు చేసుకోగా.. అందుకు 15 రోజులు పట్టింది. ఈపీఎఫ్‌ ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ సదుపాయం ఉన్నప్పటికీ.. యూఏఎన్‌ యాక్టివేట్‌ చేసుకోకపోవడం, ఆధార్‌ లింక్‌ చేసుకోకపోవడం అప్‌డేట్‌ చేసుకోకపోవడం ఇలా వివిధ కారణాలతో ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ చెల్లింపులు ఆలస్యంగా అందుకున్న వారు చాలా మందే ఉన్నారు. గిరిధర్‌ పరిస్థితి మరింత భిన్నమైనది. ఆయనకు ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ గతేడాది మూసేసిన ఆరు డెట్‌ పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరాల్సిన అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఆ పెట్టుబడులను సొమ్ము చేసుకోలేని అనుభవాన్ని చవిచూశారు.

పొదుపు పట్ల మారుతున్న ధోరణి!
కరోనా ‘పొదుపు’ పట్ల వ్యక్తుల ఆలోచన తీరునే మార్చేసింది. కొందరు జీవితకాలం పొదుపు చేసిన మొత్తాన్ని కరోనా మహమ్మారి పట్టుకుపోయిందని లబోదిబోమంటున్నారు. పొదుపు పట్ల తమ ఆలోచన మారిందని 65 శాతం మంది సర్వేలో చెప్పారు. కరోనాకు ముందుతో పోలిస్తే తాము మరింత మొత్తాన్ని పొదుపు చేస్తామని 30 శాతం మంది తెలిపారు. జీవిత, వైద్య బీమా కవరేజీని పెంచుకోవడంతోపాటు.. భవిష్యత్తు ఖర్చుల కోసం మరింతగా పెట్టుబడులు పెడతామని కొందరు చెప్పారు. ముఖ్యంగా అత్యవసర నిధి అవసరాన్ని చాలా మంది గుర్తించారు. కొందరు అయితే ఆరు నెలల అవసరాలకు కాకుండా.. కనీసం ఏడాది నుంచి రెండేళ్ల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి అయితేనే సముచితమన్న అభిప్రాయానికి వచ్చారు.

రిస్క్‌ తీసుకోని వారు బ్యాంకు ఖాతాల్లో ఈ నిధిని ఉంచేస్తామని.. లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో, స్వీప్‌ ఇన్‌ బ్యాంకు ఖాతా రూపంలో ఉంచుకుంటామని చెప్పారు. వయసులో చిన్న వారు అయితే రిస్క్‌ తీసుకుని అత్యవసర నిధిని స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో, లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తామని తెలిపారు. కానీ, ఇలాంటి నిర్ణయాల విషయంలో తగినంత ముందస్తు అధ్యయనం,  పర్యవేక్షణ అవసరం. కరోనా వేళ తమకు నిధుల అవసరం ఏర్పడినప్పుడు స్టాక్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకుందామనుకుంటే.. నష్టాలు దర్శనమిచ్చాయని సర్వేలో కొందరు చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ అవసరాన్ని స్వయం ఉపాధుల్లో ఉన్న వారు గుర్తించారు. రిటైర్మెంట్‌ తర్వాత రిస్క్‌ వద్దని చెబుతుంటారు. అయినా, పెట్టుబడుల విషయంలో రిస్క్‌ తీసుకున్న వారికి కరోనా కాలం తగిన అనుభవాన్నే నేర్పింది.  

అప్పు అసలే వద్దు..
‘‘అస్సలు అప్పుల్లో ఉండకూడదని, ఉన్నా చాలా పరిమిత రుణ భారానికే కట్టుబడాలని కొందరి అనుభవం చెబుతోంది.  ‘‘నేను నా పెట్టుబడులను వెనక్కి తీసుకుని రుణాన్ని ముందుగానే తీర్చేశాను. వెంటనే రుణ రహితంగా మారాల్సిన అవసరాన్ని గుర్తించాను. ఎందుకంటే ఒకవేళ నాకు ఏదైనా జరిగితే నా చిన్నారిపై అప్పులు తీర్చాల్సిన భారం పడకూడదు’’అని సర్వేలో పాల్గొన్న పలువురు పేర్కొన్నారు.

ఎలా ఎదుర్కొన్నారు..?
ఊహించని, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు గట్టెక్కేందుకు అత్యవసర నిధి అంటూ ఒకటి కచ్చితంగా ప్రతీ ఇంటికి ఉండాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఇంటి బడ్జెట్‌లో దీనికి పెద్ద ప్రాధాన్యతే ఉంది. కానీ, ఇప్పటికీ చాలా మంది దీన్ని ఆచరణలో పెట్టడం లేదని ఈ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే కేవలం 36.5 శాతం వద్దే అత్యవసర నిధి ఉంది. పైగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఖర్చులను పెద్ద మొత్తంలో తగ్గించుకోవడం అన్నది అందరికీ సాధ్యపడని విషయం. అయినా, 75 శాతం మంది సాధ్యమైనంత వరకు ఖర్చులకు కోత విధించుకున్నట్టు చెప్పారు. సాధారణంగా ఆరు నెలల అవసరాలు, ఖర్చులు, పెట్టుబడులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద ఉంచుకోవాలన్నది ఆర్థిక సూత్రం. అయితే, కరోనా వంటి విపత్తుల్లో ఆరు నెలల అవసరాలకు సరిపడే అత్యవసర నిధి ఏ మేరకు సరిపోతుందన్న ప్రశ్న? ఇప్పుడు కొత్తగా ఉదయించింది. ఎందుకంటే చెన్నైకు చెందిన మృదుల చాలా పద్ధతిగా, ప్రణాళిక మేరకు నడుచుకునే వారే. ఆమె, ఆమె తండ్రి కలసి అత్యవసర నిధి కింద కొన్ని రూ. లక్షలు సిద్ధంగా ఉంచుకున్నవారే. కానీ, ఆమె తల్లి కరోనాతో సుదీర్ఘకాలం పాటు ఆస్పత్రిలో ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఖర్చు వచ్చి పడింది. దీంతో మృదుల తన దీర్ఘకాల లక్ష్యాల కోసం చేస్తున్న డెట్‌ పెట్టుబడులను ఉపసంహరించుకుని ఆస్పత్రికి చెల్లించారు. ఆమె ఒక్కరే కాదు.. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది తమ అత్యవసర వ్యయాల కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బాండ్లు, పోస్టాఫీసు పొదుపులు, స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌ను విక్రయించారు. ‘‘ఆస్పత్రి నుంచి ఇంత చెల్లించాలంటూ డిమాండ్‌ రావచ్చని ముందే ఊహించా ను. దాంతో కొన్ని రోజుల ముందే పెట్టుబడులను విక్రయించడం వల్ల అవి నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. దాంతో చెల్లింపులు చేయగలిగాను’’ అని మృదుల వివరించారు.

విజయ్‌ది భిన్నమైన అనుభవం. విశాఖపట్నంకు చెందిన ఆయన కాస్ట్‌ అకౌంటెంట్‌గా సేవలు అందిస్తున్నారు. అత్యవసర నిధి అంటూ ఆయనకు ఏదీ లేదు. దీంతో అత్యవసరాల్లో క్రెడిట్‌ కార్డును ఉపయోగించి చెల్లింపులు చేశారు. ‘‘మా నాన్న గారు ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో రూ.2.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. స్టాక్స్‌లో నాకు పెట్టుబడులు ఉన్నాయి. కానీ నాన్న శుక్రవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. దీంతో సోమవారం కానీ స్టాక్స్‌ను విక్రయించలేను. విక్రయించిన మేర సొమ్ము నా బ్యాంకు ఖాతాకు రావడానికి బుధవారం వరకు వేచి ఉండాల్సిందే. దీంతో క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లించడం ఒక్కటే నాకు సౌకర్యవంతమైన మార్గంగా అనిపించింది. కార్డు ద్వారా చెల్లించి ఆ తర్వాత నిధులు సర్దుబాటు చేసుకుందామని నిర్ణయానికొచ్చేశాను’’ అని విజయ్‌ తెలిపారు. కష్టకాలంలో ఇలా క్రెడిట్‌ కార్డులను వినియోగించిన వారు చాలా మందే ఉన్నారు. కానీ, క్రెడిట్‌ కార్డుపై లిమిట్‌ను వాడుకోవచ్చు కానీ.. గడువులోపు ఇతర మార్గాల్లో నిధులను సర్దుబాటు చేసుకుని తీర్చేయడం వల్లే ఉపయోగం ఉంటుంది. లేదంటే క్రెడిట్‌ కార్డు బకాయిలపై 3–4 రూపాయిల వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిసిందే. ఇది మధ్యతరగతి ఇంటి బడ్జెట్‌ను మరింతగా తారుమారు చేసేయగలదు.  

కరోనా వల్ల ఎదురైన ఆర్థిక భారాన్ని ఎలా అధిగమించారు?
వినియోగ సాధనం    ఎంతమంది(%)
అత్యవసర నిధి వినియోగం    36.5  
క్రెడిట్‌ కార్డులతో చెల్లింపులు    18.6
అనధికారిక, వ్యక్తిగత, బంగారు, ఇతర రుణాలు    11.5
స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌ విక్రయం    19.6
ఎఫ్‌డీలు, బాండ్ల ఉపసంహరణ    13.5
పోస్టాఫీసు పథకాల నుంచి ఉపసంహరణ    3.4
బీమా పాలసీల సరెండర్‌    4.7
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌    6.1
ఖర్చులను తగ్గించేసుకున్నవారు    75.5

ఆరోగ్యం లేకుంటే డబ్బున్నా.. సున్నానే!
‘‘మీకు ఈ రోజు డబ్బులు ఉండొచ్చు. అయినా ఆరోగ్యాన్ని, ఆక్సిజన్‌ను కొనుక్కోలేని పరిస్థితి. భవిష్యత్తులో డబ్బు అన్నది ఏ మాత్రం హోదా కాబోదు. మంచి ఆరోగ్యం, చక్కని ఆహారంతోపాటు.. ఎన్ని చెట్లను నాటారు అన్నదే ముఖ్యమవుతుంది’’ సర్వేలో ఒక అభ్యర్థి చెప్పిన మాట ఇది.

మరిన్ని వార్తలు