WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్‌ టాప్‌!

2 Mar, 2023 18:45 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌ల ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగులకు ఊరట కలిగించే ఓ సర్వే విడుదైంది. భారత్‌లో ఈ ఏడాది జీతాలు 10 శాతం మేర పెరగనున్నట్లు తాజాగా ఓ సర్వే పేర్కొంది.  దాని ప్రకారం ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌లో జీతాల పెరుగుదల భారత్‌లోనే అత్యధికం. ఇదే 2022లో మన దేశంలో జీతాల పెరుగుదల 9.8 శాతం నమోదైంది.

గ్లోబల్‌ అడ్వయిజరీ, బ్రోకింగ్‌, సొల్యూషన్స్‌ సంస్థ డబ్ల్యూటీడబ్ల్యూ శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌ పేరుతో ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం.. ఈ ఏడాదిలో చైనాలో 6 శాతం, వియత్నాంలో 8 శాతం, ఇండోనేషియాలో 7 శాతం, హాంకాంగ్‌లో 4 శాతం, సింగపూర్‌లో 4 శాతం జీతాలు పెరుగుతాయని అంచనా.

కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జీతాల పెరుగుదల క్షీణించింది. తర్వాత క్రమంగా పుంజకుంది. 2019లో 9.9 శాతం ఉన్న వేతనాలు 2020లో 7.5 శాతం, 2021లో 8.5 శాతం పెరిగాయి. 2022లో 9.8 శాతం పెరిగాయి.

ఏయే రంగాల్లో ఎంతెంత?
ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్ మీడియా, గేమింగ్, ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ,  కెమికల్స్, రిటైల్ రంగాలలో అత్యధికంగా 10 శాతం జీతాలు పెరుగుతాయని అంచనా. ఇక తయారీ రంగం, బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్ రంగాలలో జీతాల పెంపు అంతంత మాత్రమే.

చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. మరో ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డ్‌!

వ్యాపార అవకాశాలు, ఉద్యోగుల నిలుపుదల ప్రస్తుతం భారతదేశంలో జీతాల పెంపునకు ప్రధాన చోదకాలని డబ్ల్యూటీడబ్ల్యూ ఇండియా వద్ద వర్క్ అండ్ రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్‌గా ఉన్న రజుల్ మాథుర్ పేర్కొన్నారు.  దాదాపు 80 శాతం భారతీయ కంపెనీలు రాబోయే ఈ ఏడాది వ్యాపార ఆదాయాన్ని మరింత పెంచుకునే ఆలోచనతో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

ఇదీ చదవండి: MG Motor: ఆ స్మార్ట్‌ ఈవీ పేరు ‘కామెట్‌’... రేసింగ్‌ విమానం స్ఫూర్తితో...

మరిన్ని వార్తలు