సేల్స్‌ఫోర్స్‌ చేతికి స్లాక్‌ టెక్నాలజీస్‌

2 Dec, 2020 09:16 IST|Sakshi

స్లాక్‌ను సొంతం చేసుకోనున్న సేల్స్‌‘ఫోర్స్‌’

వర్క్‌ ప్లేస్‌ యాప్‌ స్లాక్‌ కొనుగోలుకి సేల్స్‌ఫోర్స్‌ డీల్‌

ఒప్పందం విలువ 27.7 బిలియన్‌ డాలర్లు

డీల్‌లో భాగంగా స్లాక్‌ వాటాదారులకు 27 డాలర్ల నగదు

మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌తో పోటీలో వెనుకడుగు

న్యూయార్క్‌: వర్క్‌ప్లేస్‌ మెసేజింగ్‌ యాప్‌ స్లాక్‌ టెక్నాలజీస్‌ ఇంక్‌ను కొనుగోలు చేసేందుకు సేల్స్‌ఫోర్స్‌.కామ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్‌ విలువ 27.7 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 2.05 లక్షల కోట్లు). క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల దిగ్గజం సేల్స్‌ఫోర్స్‌ కుదుర్చుకున్న అతిపెద్ద డీల్‌ ఇది. తద్వారా రిమోట్‌ వర్కింగ్‌ సేవలకు మరింత బూస్ట్‌నివ్వనుంది. అంతేకాకుండా క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ప్రత్యర్ధి సంస్థ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు పోటీనివ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ డీల్‌ ద్వారా సేల్స్‌ఫోర్స్‌.. ఉద్యోగులు, కస్టమర్లు, భాగస్వాములతో బిజినెస్‌ల కనెక్టివిటీకి యూనిఫైడ్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు కానున్నట్లు విశ్లేషకులు వివరించారు. యాప్‌ల వినియోగం ద్వారా రెండువైపులా కనెక్టివిటీకి వీలు కలగనున్నట్లు తెలియజేశారు. 

టీమ్స్‌ జూమ్
కోవిడ్‌-19 కారణంగా తలెత్తిన రిమోట్‌ వర్కింగ్‌ పరిస్థితులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడంతో పోటీలో స్లాక్‌ టెక్నాలజీస్‌ వెనుకబడినట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియజేశారు. రియల్‌ టైమ్‌ మెసేజింగ్‌ ద్వారా గ్రూప్‌ల మధ్య సంభాషణలకు వీలు కల్పిస్తూ స్లాక్‌ సర్వీసులను అందిస్తోంది. మరోపక్క మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ ప్రొడక్ట్‌లో భాగంగా వీడియో, వాయిస్‌ కాలింగ్‌కు వీలు కల్పిస్తూ బిజినెస్‌ను భారీగా పెంచుకున్నట్లు పేర్కొన్నారు. ఆఫీస్‌ ప్యాకేజీలతోపాటు.. టీమ్స్‌ను అందించడం ద్వారా మైక్రోసాఫ్ట్‌ లబ్ది పొందినట్లు తెలియజేశారు. కాగా.. సేల్స్‌ఫోర్స్‌తో డీల్‌ కుదుర్చుకోవడం ద్వారా టెక్నాలజీయేతర కంపెనీలకూ స్లాక్‌ సర్వీసులు విస్తరించే వీలున్నట్లు వివరించారు.

డీల్‌ తీరిలా
స్లాక్‌తో సేల్స్‌ఫోర్స్‌ కుదుర్చుకున్న ఒప్పందం ఎలాగంటే.. యూఎస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో మంగళవారం సేల్స్‌ఫోర్స్‌ షేరు 45.5 డాలర్ల వద్ద ముగిసింది. దీని ఆధారంగా స్లాక్‌ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకి 26.79 డాలర్ల నగదు లభించనుంది. అంతేకాకుండా 0.0776 సేల్స్‌ఫోర్స్‌ షేర్లు సొంతంకానున్నాయి. గత వారం డీల్‌పై చర్చలు బయటపడ్డాక అంచనా వేసిన విలువతో పోలిస్తే ఈ ఆఫర్‌ను 54 శాతం ప్రీమియంగా నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్‌ ముగిశాక డీల్‌ వివరాలు వెల్లడికావడంతో ఫ్యూచర్స్‌లో సేల్స్‌ఫోర్స్‌ షేరు 4 శాతం పతనంకాగా.. స్లాక్‌ షేరు నామమాత్ర నష్టంతో 43.73 డాలర్లకు చేరింది. కాగా.. ఈ ఏడాది మూడో క్వార్టర్‌లో సేల్స్‌ఫోర్స్‌ ఆదాయం అంచనాలను మించుతూ 5.42 బిలియన్‌ డాలర్లకు చేరింది. సీఎఫ్‌వో మార్క్‌ హాకిన్స్‌ జనవరిలో పదవీ విరమణ చేయనున్నట్లు సేల్స్‌ఫోర్స్‌ తాజాగా పేర్కొంది. సీఎఫ్‌వో బాధ్యతలను ప్రస్తుత చీఫ్‌ లీగల్‌ ఆఫీసర్‌ను అమీ వీవర్‌ చేపట్టనున్నట్లు తెలియజేసింది.

మరిన్ని వార్తలు