‘అదో పీడకల’.. పదవి నుంచి తొలగించడంపై ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌..

11 Dec, 2023 17:19 IST|Sakshi

సీఈఓ పదవి నుంచి తనని అర్ధాంతరంగా తొలగించడంపై ఓపెన్‌ఏఐ  శామ్‌ఆల్ట్‌ మన్‌ స్పందించారు. సీఈఓగా తొలగించిన సమయంలో తనకు ఎదురైన చేదు జ్ఞాపకాల్ని ఓ పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూలో వెలుగులోకి తెచ్చారు. 

శామ్‌ ఆల్ట్‌మన్‌..ఓపెన్‌ ఏఐ సీఈఓ. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. చాట్‌జీపీటీ విడుదలతో ప్రపంచం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్న అసాధ్యుడు. అలాంటి ఆల్ట్‌మన్‌ను కొద్ది రోజుల క్రితం ఓపెన్‌ ఏఐ సంస్థ బోర్డ్‌ అతనిని సీఈఓ పదవి నుంచి తొలగించింది.  

ఆ తర్వాత వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్‌ను తిరిగి సంస్థలోకి తీసుకోక తప్పలేదు ఆ బోర్డ్‌ సభ్యులకు. అయితే పదవీచ్యుతుడైన తరువాత ‘‘ టైమ్స్‌ సీఈఓ ఆఫ్‌ ది ఇయర్‌ 2023’’ కి ఎంపికయ్యారు. ఈ తరుణంలో దక్షిణాఫ్రికా కమెడియన్‌, ట్రెవర్‌ నోహ్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఆల్ట్‌మన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనకి పింక్‌ స్లిప్‌ ఇచ్చిన తర్వాత ఏమైందనే విషయాల్ని పంచుకున్నారు. 

శామ్‌ ఆల్ట్‌మన్‌ని సీఈఓ పదవి నుంచి ఎప్పుడు తొలగించారు?
నవంబర్‌ 17, 2023న ఓపెన్‌ ఏఐ బోర్డ్‌ ఆల్ట్‌మన్‌ని సీఈఓ పదవి నుంచి తొలగించింది. 

ఆల్ట్‌మన్‌ ఐఫోన్‌కి ఏమైంది?
ట్రెవర్‌ నోహ్‌ పాడ్‌కాస్ట్‌లో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ మాట్లాడుతూ.. ‘‘ ఈ పరిణామం (తనను తొలగించడం) నన్ను మరింత గందర గోళంలోకి నెట్టింది. నా ఐఫోన్ కూడా పనిచేయడం ఆగిపోయింది.

నేను హోటల్‌ గదిలో ఉండగా.. ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. అవతలి నుంచి ‘‘ మిమ్మల్ని ఓపెన్‌ ఏఐ బోర్డ్‌ సభ్యులు సీఈఓ పదవి నుంచి తొలగించారు’’ అని ఆ కాల్‌ సారాంశం. ఏం జరిగిందో తెలియదు. అంతా గందర గోళం. ఓ వైపు నన్ను తొలగిస్తున్నట్లు ఫోన్‌ కాల్‌, మరోవైపు నా ఐఫోన్‌ పనిచేయడం లేదు. దానంతటికి ఐమెసేజ్‌ అని అర్ధమైంది. 

కొద్ది సేపటికి ఐమెసేజ్‌కు వరుసగా మెసేజ్‌లు వస్తున్నాయి. ఆమెసేజ్‌లు నాతో పనిచేయాలనుకున్న వారి నుంచేనని అర్ధమైంది. అన్నింటిని చదివాను. వాటిని చదివాక అయోమయంలో పడ్డాను. అదో పీడ కలలా అనిపించింది. బోర్డు నిర్ణయంతో కలత చెందాను’’ అని అన్నారు.

>
మరిన్ని వార్తలు