శామ్‌సంగ్‌ భారీ ప్రణాళిక..ఆ మార్కెట్‌పై గురి..!

20 Apr, 2022 09:33 IST|Sakshi

దేశీయంగా 36 శాతం వాటా లక్ష్యం 

న్యూఢిల్లీ: కన్జూమర్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ ఇండియా ఈ ఏడాది లెడ్‌ టీవీ విభాగంలో 25 శాతం వృద్ధిని ఆశిస్తోంది. తద్వారా మొత్తం టీవీ మార్కెట్‌లో 36 శాతం వాటాను సొంతం చేసుకోవాలని లక్షిస్తోంది. ఇందుకు తగిన వ్యూహాలతో కొత్త టెక్నాలజీలు, ప్రొడక్టులను విడుదల చేయాలని ప్రణాళికలు వేసింది. మరోవైపు ప్రీమియం టీవీ అమ్మకాలను సైతం భారీగా పెంచుకోవాలని చూస్తోంది. వెరసి ఈ విభాగంలో మార్కెట్‌ వాటాను గతేడాది సాధించిన 50 శాతం నుంచి 60 శాతానికి చేర్చుకోగలమని అంచనా వేస్తోంది.  

అల్ట్రా ప్రీమియంలో.. 
మార్కెట్‌ వాటాను పెంచుకునే బాటలో తాజాగా అల్ట్రా ప్రీమియం బ్రాండ్ల విభాగంలో శామ్‌సంగ్‌ ఇండియా 2022 నియో క్యూలెడ్‌ 8కే, నియో క్యూలెడ్‌ టీవీలను దేశీయంగా ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధరలు రూ. 3.24 లక్షలు, రూ. 1.14 లక్షలుగా తెలియజేసింది. గతేడాది మొత్తం టీవీ పరిశ్రమలో 31.7 శాతం మార్కెట్‌ వాటాను చేజిక్కించుకోగా.. తాజా మోడళ్ల విడుదల ద్వారా విలువరీత్యా 36 శాతానికి పెంచుకోవాలని చూస్తున్నట్లు శామ్‌సంగ్‌ ఇండియా కన్జూమర్‌ ఎలక్ట్రానిక్‌ బిజినెస్‌ అమ్మకాలు, మార్కెటింగ్, నిర్వహణ హెడ్‌ మోహన్‌ దీప్‌ సింగ్‌ తెలియజేశారు. పరిశ్రమ విశ్లేషకుల అంచనాల ప్రకారం దేశీ టీవీ మార్కెట్‌ 2022కల్లా 4.6 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 35,000 కోట్లు)కు చేరవచ్చు.   

చదవండి: నిరుత్సాహకర ఫలితాలు..ఏసీసీ లాభం 30 శాతం డౌన్‌ 

మరిన్ని వార్తలు