Samsung Vs One Plus: కెమెరాల పని అయ్యింది ఇక డిస్‌ప్లేల వంతు!

11 Aug, 2021 16:56 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌ : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా ఉన్న ఇండియాలో కొత్త యుద్దానికి తెర లేచింది. ఇంత కాలం చిప్‌సెట్స్‌, కెమెరాల విషయంలో పోటాపోటీగా మోడళ్లు విడుదల చేసిన ఫోన్‌ తయారీ కంపెనీలు ఇప్పుడు డిస్‌ప్లే కేంద్రంగా వార్‌ రెడీ అయ్యాయి. 

బ్రాండ్‌ వార్‌
స్మార్ట్‌ఫోన​ ఇండస్ట్రీలో గడిచిన ఐదేళ్లలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. శామ్‌సంగ్‌, యాపిల్‌ వంటి బడా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ చైనాకు చెందిన వన్‌ప్లస్‌, షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివోలు మార్కెట్‌పై పట్టు సాధించాయి. మైక్రోమ్యాక్స్‌, సెల్‌కాన్‌ వంటి దేశీ కంపెనీలను చైనా మొబైల్‌ బ్రాండ్స్‌ వెనక్కి నెట్టాయి. నోకియా ఇంకా ఫీచర్‌ ఫోన్లను దాటి ముందుకు రాలేకపోయింది. హ్యువావే, ఎల్‌జీ, సోనిలు పత్తా లేకుండా పోయాయి. ప్రస్తుతం శామ్‌సంగ్‌, చైనా కంపెనీల మధ్యనే ప్రైస్‌వార్‌, ఫీచర్‌ వార్‌ జరుగుతోంది.

ఎన్ని కెమెరాలు, పిక్సెల్‌ ఎంత
స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి గడిచిన నాలుగేళ్లుగా వెనుక వైపు ఎన్ని కెమెరాలు ఉన్నాయి. వాటి మెగాపిక్సెల్‌ ఎంత అనే అంశం చుట్టూనే ఇటు శామ్‌సంగ్‌, అటు షావోమీ వంటి చైనా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ పోటీ పెరిగి వెనుక వైపు నాలుగు, ముందు వైపు రెండు కెమెరాలు అందించే స్థాయికి చేరుకున్నాయి. ఇక కెమెరా సామర్థ్యానికి సంబంధించి 16 మెగా పిక్సెల్స్‌ దగ్గర మొదలైన పోటీ  48 మెగా పిక్సెల్స్‌ మీదుగా 108 మెగా పిక్సెల్స్‌ వరకు చేరుకుందీ. ఇదే సమయంలో ర్యామ్‌ కెపాసిటీ విషయంలోనూ పోటీ నెలకొని ఉండేది. ఇక్కడ కూడా ఇరు వర్గాలు సమస్థాయికి చేరుకున్న బ్యాటరీ సామర్థ్యం మీద ఫోకస్‌ చేశాయి. టాప్‌ నాచ్‌, డ్రాప్‌ నాచ్‌ అంటూ మోడళ్లు విడుదల చేసినా అవి లాంగ్‌రన్‌లో ప్రభావం చూపలేదు. కెమెరా, ర్యామ్‌, ప్రాసెసర్‌లే ప్రధానంగా పోటీ నెలకొంది. డిస్‌ప్లే క్వాలిటీ విషయంలో పోటీ ఉన్నా హెచ్‌డీ, ఫుల్‌హెచ్‌డీ దగ్గరే చైనా కంపెనీలు ఆగిపోగా శామ్‌సంగ్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే తో అదరగొట్టింది. శామ్‌సంగ్‌ నోట్‌, ఎస్‌ సిరీస్‌లో 4కే డిస్‌ప్లేలు ఇచ్చి టాప్‌గా నిలవగా వన్‌ప్లస్‌ సైతం బరిలోకి దిగింది.

వీడియో కంటెంట్‌కి గిరాకీ
జియో రాకతో ఒక్కసారిగా ఇండియాలో నెట్‌ కంటెంట్‌ వాడకం పెరిగింది. దీనికి తోడు లాక్‌డౌన్‌ కారణంగా వీడియో కంటెంట్‌కి డిమాండ్‌ పెరిగింది. రోజుకో వీడియో స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి వస్తోంది. దీంతో డిస్‌ప్లే క్వాలిటీతో పాటు సైజుకి కూడా ప్రాధాన్యత పెరిగింది. గతేడాదే శామ్‌సంగ్‌ జెడ్‌ సిరీస్‌లో ఫ్లిప్‌ అంటూ డబుల్‌ డిస్‌ప్లే ఫోన్లను అందుబాటులోకి తెచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో జెడ్‌ సిరీస్‌కే మరిన్ని హంగులు జోడించి ఆగస్టు 11న రిలీజ్‌ చేసేందుకు సిద్దమైంది. జెడ్‌ సిరీస్‌లో రెండు తెరలు కలిపితే స్క్రీన్‌ సైజు 7.30 ఇంచులుగా ఉంది. దాదాపు ట్యాబ్‌ స్థాయిలో ఈ స్ర్రీన్‌ ఉండనుంది.

శామ్‌సంగ్‌ వర్సెస్‌ వన్‌ ప్లస్‌
నాణత్య పాటిస్తూ తక్కువ బడ్జెట్‌లో హై ఎండ్‌ ఫీచర్లు అందిస్తూ వన్‌ ప్లస్‌ బ్రాండ్‌ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకుంది. హై ఎండ్‌ సెగ్మెంట్‌లో యాపిల్‌, శామ్‌సంగ్‌కి ధీటుగా ఎదిగింది. బడ్జెట్‌కి ప్రాముఖ్యత ఇచ్చే ఇండియన్‌ మార్కెట్‌లో స్థిరమైన స్థానం సాధించింది. అన్నింటా శామ్‌సంగ్‌, యాపిల్‌కు పోటీ ఇచ్చే వన్‌ప్లస్‌ ఇప్పుడు బిగ్‌ స్క్రీన్‌ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదంటోంది. ఆగస్టులో బిగ్‌ స్క్రీన్‌ ఫోన్‌ రిలీజ్‌ చేస్తామంటూ శామ్‌సంగ్‌ దాదాపు రెండు నెలల ముందు నుంచే లీకులు ఇస్తూ వచ్చింది. చివరకు ఆగస్టు 11న డేట్‌ ఫిక్స్‌ చేసింది. సరిగ్గా శామ్‌సంగ్‌ ఈవెంట్‌కి ఒక్క రోజు ముందే వన్‌ప్లస్‌ సప్రైజింగ్‌ న్యూస్‌ చెప్పింది. తమ బ్రాండ్‌  నుంచి కూడా బిగ్‌ స్క్రీన్‌ ఫోన్‌ వస్తోందంటూ  వన్‌ప్లస్‌ యూఎస్‌ఏ ట్విట్టర్‌ పేజీలో టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. దీంతో రెండు కంపెనీల మధ్య ఆసక్తికర పోరుకి తెరలేచింది.

ప్రభావం చూపుతుందా ?
మొబైల్‌ బ్రాండ్ల మధ్య ధర, కెమెరా, ర్యామ్‌, చిప్‌సెట్‌, బ్యాటరీ బ్యాకప్‌ విషయంలోనే గట్టి పోటీ నెలకొంది. వీటి ఆధారంగానే అమ్మకాలు సాగాయి. మధ్యలో ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, నాచ్‌, డిస్‌ ప్లే రి ఫ్రెష్‌ రేటు విషయంలో కంపెనీలు ప్రయోగాలు చేసినా అవేమీ అమ్మకాలపై గణనీయమైన ప్రభావం చూపలేదు. ఇప్పుడు బిగ్‌ స్క్రీన్‌ వార్‌ నిజంగానే ప్రభావం చూపుతుందా లేక కొద్ది కాలం హడావుడి తర్వాత సద్దుమణుగుతుందా అనేది తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు