గెలాక్సీ ఫోన్లలోవాటర్-రెసిస్టెన్స్ ఫీచర్: శాంసంగ్‌కు భారీ షాక్‌

23 Jun, 2022 12:21 IST|Sakshi

గెలాక్సీ ఫోన్లలోవాటర్-రెసిస్టెన్స్ ఫీచర్ : తప్పుడు ప్రకటనపై భారీ ఫైన్‌

 శాంసంగ్‌ ఆస్ట్రేలియాపై 76 కోట్ల రూపాయల జరిమానా

న్యూఢిల్లీ: దక్షిణకొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియాలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్‌కు సంబంధించి అవాస్తవాలను ప్రకటించిందంటూ  ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్‌ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ)  భారీ జరిమానా విధించింది. 

కొన్ని మోడళ్ల గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లలో వాటర్-రెసిస్టెన్స్ ఫీచర్ గురించి తప్పుదారి పట్టించేలా వ్యవహరించిందని ఏసీసీసీ తేల్చింది. దీనికి గాను స్థానిక శాంసంగ్‌ యూనిట్‌కు 14 మిలియన్ల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (సుమారు 76 కోట్ల రూపాయలు) జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించిందని  ఆస్ట్రేలియా  కాంపిటీషన్‌ రెగ్యులేటరీ  గురువారం తెలిపింది.  తప్పుదోవ పట్టించే ప్రకటనలతో మార్చి 2016, అక్టోబర్ 2018 మధ్య,  ఆస్ట్రేలియాలో గెలాక్సీ S7, S7 ఎడ్జ్, A5 (2017), A7 (2017), S8, S8 ప్లస్ , ఎస్‌ నోట్ 8  మెడల్స్‌ 3.1 మిలియన్  ఫోన్లను  శాంసంగ్‌ విక్రయించిందని పేర్కొంది.  ఈ మేరకు కమిటీ చైర్ గినా కాస్-గాట్లీబ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు సరిగ్గా పనిచేయడం లేదని, లేదా నీటిలో తడిచిన తర్వాత పూర్తిగా పనిచేయడం మానేసాయంటూ వినియోగదారుల వందలాది ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.  

ఈ ఫోన్‌లను కొలనులు లేదా సముద్రపు నీటిలో కూడా ఉపయోగించవచ్చని క్లెయిమ్ చేస్తూ, ఇన్-స్టోర్, సోషల్ మీడియా ప్రకటనలను కంపెనీ విడుదల చేసిందని రెగ్యులేటరీ ఆరోపించింది. ఈ మేరకు శాంసంగ్‌పై రెగ్యులేటరీ గతంలో  దావా  వేసింది.  అయితే తాజా పరిణామంపై  శాంసంగ్‌ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

>
మరిన్ని వార్తలు