శామ్‌సంగ్‌ నుంచి అయిదు స్మార్ట్‌ఫోన్స్‌ 

30 Mar, 2022 04:57 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీలో ఉన్న శామ్‌సంగ్‌ తాజాగా గెలాక్సీ ఏ–సిరీస్‌లో అయిదు స్మార్ట్‌ఫోన్స్‌ ప్రవేశపెట్టింది. ధర రూ.15,000 నుంచి ప్రారంభం. 108 ఎంపీ క్వాడ్‌ కెమెరా, సూపర్‌ అమోలెడ్‌ 120 హెట్జ్‌ డిస్‌ప్లేతో గెలాక్సీ ఏ73 5జీ తయారైంది. 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 25 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ పొందుపరిచారు.

గెలాక్సీ ఏ53, ఏ23, ఏ13, ఏ33 మోడళ్లలో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఏర్పాటు ఉంది. కాగా, ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రూ.20–45 వేల ధరల శ్రేణి విభాగంలో 40 శాతం వాటాను శామ్‌సంగ్‌ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే ఈ విభాగంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. 5జీ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్లో ప్రస్తుతం 16 మోడళ్లను విక్రయిస్తోంది. నెలకు 3 లక్షల మంది శామ్‌సంగ్‌ ఫైనాన్స్‌ ప్లస్‌ ద్వారా సులభ వాయిదాల్లో స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలు చేస్తున్నారని కంపెనీ మిడ్, హై స్మార్ట్‌ఫోన్స్‌ విభాగం హెడ్‌ అక్షయ్‌ ఎస్‌ రావు మంగళవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. వీరిలో 50 శాతం మంది తొలిసారిగా రుణం తీసుకున్నవారేనని వివరించారు.

మరిన్ని వార్తలు