Samsung Z Flip Pocket Denim Jeans: స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం కొత్త ఐడియా, జీన్స్‌ కొంటే ఫోన్‌ ఫ్రీ

3 Nov, 2021 19:05 IST|Sakshi

ఇటీవల కాలంలో ఆయా టెక్‌ సంస్థలు వేస్తున్న వ్యాపార ఎత్తు గడలు చిత్తవుతున్నాయి. నవ్వులు పూయిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ పాలిషింగ్‌ క్లాత్‌ అమ్మకానికి పెట్టి నెటిజన్ల చేతిలో అభాసుపాలైంది. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ 'మా జీన్స్ ప్యాంట్ కు రెండు జేబులంటూ' ప్రచారం చేయడంపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. 

యాపిల్‌ కంటే శాంసంగ్‌ రెండాకులు ఎక్కువే  
సౌత్‌ కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ ఈ ఏడాది ఆగస్ట్‌ 11న  గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 మడత (ఫోల్డబుల్‌) ఫోన్‌లను విడుదల చేసింది.అయితే శాంసంగ్‌ ఆ మడత ఫోన‍్లసేల్స్‌ కోసం కొత్త బిజినెస్‌ ట్రిక్‌ ప్లే చేసింది. శాంసంగ్‌ ఆస్ట్రేలియాకు చెందిన 'డాక్టర్‌ డెనిమ్‌ జీన్స్‌' సంస్థతో ఒప్పొందం కుదుర్చుకుంది. గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 ఫోన్‌ను పెట్టుకునేందుకు వీలుగా పరిమితంగా ఎడిషన్‌ జెడ్‌ ఫ్లిప్‌ పాకెట్‌ డెనిమ్‌ జీన్స్‌ ప్యాంట్‌ను విడుదల చేసింది. దీని ధర 1499 డాలర్లు (రూ.1,11,649.87) ఉండగా.. ఆ జీన్స్‌ ప్యాంట్‌ను కొనుగోలు చేసిన వారికి శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 (ధర ఇండియాలో రూ.84,999.) ఫోన్‌లను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. కాకపోతే ఈ జీన్స్‌ ప్యాంట్లు ఇండియాలో అందుబాటులో లేవు. కేవలం ఆస్ట్రేలియాలోని డెనిమ్‌ ఔట్‌లెట్లలో కొనుగోలు చేయొచ్చు' అని శాంసంగ్‌ తన ప్రకటనలో పేర్కొంది.  

అంతే శాంసంగ్‌ చేసిన ఈ జీన్స్‌ ప్యాంట్‌ ప్రకటనపై నెటిజన్లు తమదైన స్టైల్లో సెటైర్లు వేస్తున్నారు. సాధారణంగా జీన్స్‌ ప్యాంట్‌ వెనుక భాగంలో రెండు జేబులుంటాయి. వాటిని తొలగించి అదే జీన్స్‌ ప్యాంట్‌ ముందు భాగంలో మొకాళ్లపైకి కుట్టి అమ్మేస్తే సరిపోతుందా అంటూ ట్వీట్‌ చేస్తున్నారు. అంతేకాదు మొన్న యాపిల్‌ విడుదల చేసిన పాలిషింగ్‌ క్లాత్‌ ను గుర్తు చేసుకుంటూ..'యాపిల్‌ కంటే శాంసంగ్‌ రెండాకులు ఎక్కువే చదివినట్లుందే' నంటూ ట్విట్లతో రెచ్చిపోతున్నారు.

యాపిల్‌ పాలిషింగ్‌ క్లాత్‌ 
గతనెలలో యాపిల్‌ సంస్థ  ఆపిల్ లాంచ్‌ ఈవెంట్‌లో తన కొత్త మాక్ బుక్ ప్రోస్, ఎమ్1 ప్రో, మ్యాక్స్ చిప్స్, మూడవ తరం ఎయిర్ పాడ్స్‌తో పాటు అదనంగా ఈవెంట్ తర్వాత ఒక పాలిషింగ్ వస్త్రాన్ని విడుదల చేసింది. పనిలో పనిగా ప్రెస్టేజ్ కు సింబల్ గా భావించి యాపిల్ ప్రొడక్ట్ లను కొనుగోలు చేసే వారికోసం  కాస్ట్లీ పాలిషింగ్‌ క్లాత్  తీసుకొచ్చింది. ఆ క్లాత్‌ ధర మన దేశంలో రూ.1900లుగా ఉంది. అంతే ఈ పాలిషింగ్‌ క్లాత్‌తో యాపిల్‌ కంపెనీపై దుమ్మెత్తిపోశారు. 'ఎస్‌ మా ఇంట్లో యాపిల్‌ పాలిషింగ్‌ క్లాత్' ఉందంటూ న్యాప్‌కిన్‌లో యాపిల్‌ లోగోను పెట్టి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ రెండ్‌ టెక్‌ కంపెనీల కొత్త వ్యాపార పోకడతో నెటిజన్లకు మరింత ఫన్‌ దొరికిటన్లైంది. 

చదవండి : టిమ్‌ కుక్‌ ను..ఎలన్‌ తిట్టినంత పనిచేస్తున్నారు?!

మరిన్ని వార్తలు