Internationalise Rupee: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌... భారత్‌కు ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌..! అమెరికాకు చెక్‌..! 

15 Mar, 2022 18:54 IST|Sakshi

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఐరోపా సహా వివిధ దేశాలు రష్యాపైనా ఆంక్షలు విధించాయి. ఎన్నడూ లేనంతగా రష్యా ఆంక్షలను ఎదుర్కొంటుంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక ఆంక్షలను కల్గిన దేశంగా రష్యా తయారైంది. ఇక  ఐరోపా దేశాలు స్విఫ్ట్ సిస్టం నుంచి కూడా తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిను ప్రవేశపెట్టాలని ఎస్బీఐ తన రిపోర్ట్‌లో అభిప్రాయపడింది.  

డాలర్‌ అధిపత్యం..!
అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికన్‌ డాలర్‌ తన అధిపత్యాన్ని ఎప్పటినుంచో చెలాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాపారాలు పూర్తిగా డాలర్‌తోనే నడుస్తున్నాయి. అమెరికన్‌ డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర కరెన్సీను తెచ్చేందుకు పలు దేశాలు ఆలోచనలో ఉన్నాయి. కాగా గతంలోనే రష్యా తన రూబుల్ అంతర్జాతీయీకరణపై దృష్టి సారించింది. ఇప్పుడు ఉక్రెయిన్‌తో పోరు నేపథ్యంలో అమెరికా, ఐరోపా ఆంక్షల కారణంగా రష్యా వివిధ దేశాలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడింది. ఈ నిర్ణయమే భారత్‌కు కలిసి రానుంది. 

తెరపైకి  కొత్త అంతర్జాతీయ కరెన్సీ..!
అమెరికాతో పాటుగా యూరప్‌ దేశాలు రష్యాపై భారీ ఆంక్షలను విధించడంతో తెరపైకి కొత్త అంతర్జాతీయ కరెన్సీ వాడకంపై ప్రతిపాదనలు వస్తున్నాయి. పశ్చిమ దేశాల ఆంక్షలను అధిగమించేందుకు రూపాయి-రూబుల్ లేదా రూబుల్ యువాన్ వాణిజ్యాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది భారత కరెన్సీ అంతర్జాతీయీకరణకు అవకాశంగా మారుతుందని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. అంతేకాకుండా డాలర్‌కు ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచం అన్వేషిస్తోందని, రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారడానికి ఇది సరైన సమయమని ఈ నివేదిక తెలిపింది.

ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే అమెరికా కరెన్సీ డాలర్ ఆధిపత్యం మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగవచ్చు. అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలుదేశాలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. ప్రస్తుతం రష్యాపై ఆంక్షల నేపథ్యంలో మాస్కో యువాన్ - రూబుల్ లేదా రూపాయి-రూబుల్ కోసం బ్యాక్ డోర్ చర్చలు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంతో చెల్లింపులు చేసే అంశాన్ని కూడా కొంతమంది ప్రతిపాదిస్తున్నట్లు ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు.

ప్రత్యామ్నాయం కోసం..!
స్విఫ్ట్ పేమెంట్ సిస్టం నుంచి రష్యాను తొలగించడంతో ఆ దేశం భారీగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో రష్యా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.రష్యాపై విధిస్తోన్న ఆంక్షల నేపథ్యంలో రూపాయి అంతర్జాతీయీకరణ ఆలోచనకు అడుగులు పడేలా చేసిందని ఈ నివేదిక అభిప్రాయపడింది. ప్రత్యామ్నాయ చెల్లింపు, పరిష్కార విధానాలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కూడా వెల్లడి చేస్తోందని తెలిపింది. భారత్‌ రూపాయిను అంతర్జాతీయం మారకంగా వాడే గోల్డెన్‌ ఛాన్స్‌ ఇదే అంటూ నివేదికలో ఎస్బీఐ పేర్కొంది.  

కొన్ని ఇబ్బందులు..!
రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా వినియోగిస్తే ఇబ్బందులు కూడా లేకపోలేదు. ద్రవ్య పరపతి విధానం సంక్లిష్టమవుతుంది. అయితే అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ వ్యయం మాత్రం తగ్గుతుందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రూపాయి మారకం మరింత నష్టపోకుండా ఆర్బీఐ చర్యలు చేపడుతోంది.

భారత్‌కు బంపరాఫర్‌..!
ప్రపంచదేశాలకు రష్యా క్రూడాయిల్‌ను భారీగానే సరఫరా చేస్తోంది. ఆంక్షల నేపథ్యంలో ఇది కాస్త ఇబ్బందిగా మారింది. కాగా భారత్‌కు ముడిచమురును డిస్కౌంట్ పైన అధికంగా ఇస్తామని రష్యా ప్రతిపాదించింది. ఇప్పటికే రష్యన్‌ చమురు సంస్థలు ఎంతో తక్కువ ధరకు చమురు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. రష్యా జరిపే వాణిజ్యలో రూపాయి-రూబుల్‌ ప్రవేశపెడితే ఇరుదేశాలకు లాభం చేకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

చదవండి: ఉక్రెయిన్‌పై బాంబుల మోత..! రష్యా దాడులను చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ భారీ స్కెచ్‌..!

మరిన్ని వార్తలు