కళామందిర్‌కు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

17 Nov, 2022 05:42 IST|Sakshi

రూ. 1,200 కోట్ల ఐపీవోకు రెడీ

కేఫిన్‌ టెక్నాలజీస్‌కూ ఆమోదం

న్యూఢిల్లీ: సంప్రదాయ దుస్తుల విక్రయ సంస్థ సాయి సిల్క్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 1.80 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి.

కళామందిర్, వరమహాలక్ష్మి సిల్క్స్, కేఎల్‌ఎం, మందిర్‌ బ్రాండ్లతో కంపెనీ రిటైల్‌ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్విటీ జారీ నిధులను 25 కొత్త స్టోర్లు, 2 వేర్‌హౌస్‌ల ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలు తదితరాలకు సైతం కేటాయించనుంది. కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో 50 స్టోర్లను నిర్వహిస్తోంది.  

రూ. 2,400 కోట్లపై కేఫిన్‌ కన్ను
ఫైనాన్షియల్‌ సర్వీసుల ప్లాట్‌ఫామ్‌ కేఫిన్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,400 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసింది. కంపెనీ ప్రమోటర్‌ జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్‌ ఫండ్‌ పీటీఈ లిమిటెడ్‌ వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కేఫిన్‌లో జనరల్‌ అట్లాంటిక్‌ దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం కొటక్‌ మహీంద్రా 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవో దరఖాస్తును కంపెనీ మార్చిలో సెబీకి దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు