Chitra Ramkrishna: కీలక ఆదేశాలు..చిత్రా అప్పీలుపై శాట్‌ విచారణ 

19 Apr, 2022 09:21 IST|Sakshi

న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ దాఖలు చేసిన అప్పీలును సెక్యూరిటీస్‌ అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) విచారణకు స్వీకరించింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ సెబీని ఆదేశించింది. అలాగే సెబీ విధించిన రూ. 2 కోట్ల జరిమానా మొత్తాన్ని ఆరు వారాల్లోగా డిపాజిట్‌ చేయాలని చిత్రా రామకృష్ణను, ఆమెకు చెల్లించాల్సిన రూ. 4.73 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్‌ రక్షణ నిధి ట్రస్ట్‌లో కాకుండా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీకి సూచించింది.

తదుపరి విచారణను జూన్‌ 30కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెడితే, ఎన్‌ఎస్‌ఈలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాల ఆరోపణల్లో చిత్రా రామకృష్ణకు సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది.  సెలవుల ఎన్‌క్యాష్‌మెంట్‌ కింద ఆమెకు దఖలుపడే రూ. 1.54 కోట్లు, అలాగే రూ. 2.83 కోట్ల బోనస్‌ను జప్తు చేసుకుని, ఇన్వెస్టర్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ ట్రస్ట్‌లో జమ చేయాలని ఎన్‌ఎస్‌ఈకి సూచించింది. దీనితో పాటు ఈ వివాదంతో సంబంధమున్న మరికొందరిపై కూడా సెబీ జరిమానా విధించడంతో పాటు పలు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ చిత్రా రామకృష్ణ శాట్‌ను ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి.  

చదవండి: నోట్ల రద్దుతో అలా..భారత్‌పై ప్రపంచబ్యాంకు కీలక వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు