సత్యం స్కాం: 14 ఏళ్ల నిషేధం ఉత్తర్వులు పక్కకి, రామలింగరాజుకు ఊరట

3 Feb, 2023 14:21 IST|Sakshi

14 ఏళ్ల  స్టాక్ మార్కెట్  నిషేధం ఉత్తర్వులను కొట్టేసిన శాట్

న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్‌ స్కామ్‌లో రామలింగరాజు తదితరులను 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్‌ మార్కెట్ల నుంచి నిషేధిస్తూ సెబీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ శాట్‌ పక్కన పెట్టింది. 14 ఏళ్ల వ్యవధిని నిర్దేశించడానికి ఏ కారణమూ చూపలేదని పేర్కొంది. అలాగే ఒక్కొక్కరూ అక్రమంగా ఎంతెంత లబ్ధి పొందారో వేర్వేరుగా లెక్కించాల్సిందని సూచించింది. దీనిపై నాలుగు నెలల్లో కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆదేశించింది.

వివరాల్లోకి వెడితే .. ఖాతాల్లో అవకతవకలు బైటపడటంతో 2009లో సత్యం కంప్యూటర్స్‌ సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రమోటర్లయిన రామలింగ రాజు, రామ రాజులతో పాటు పలువురిపై కేసులు దాఖలయ్యాయి. ఆరుగురిని సెక్యూరిటీస్‌ మార్కెట్ల నుంచి 14 ఏళ్లు నిషేధించడంతో పాటు భారీగా జరిమానా విధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2018లో రెండు ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై వారు సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా తాజా ఆదేశాలు వచ్చాయి. 

మరిన్ని వార్తలు