యూటెల్‌శాట్‌తో వన్‌వెబ్‌ విలీనం

27 Jul, 2022 04:17 IST|Sakshi

అతి పెద్ద వాటాదారుగా ఎయిర్‌టెల్‌

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కి చెందిన ఉపగ్రహాల ఆపరేటర్‌ యూటెల్‌శాట్, కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ వన్‌వెబ్‌ విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ డీల్‌ పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో ఉండనుంది. ఇరు సంస్థల సంయుక్త ప్రకటన ప్రకారం వన్‌వెబ్‌ విలువను 3.4 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ. 27,000 కోట్లు) లెక్కకట్టారు.

ప్రస్తుతం వన్‌వెబ్‌లో కీలక భాగస్వామి అయిన దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ .. డీల్‌ పూర్తయిన తర్వత యూటెల్‌శాట్‌లో అతి పెద్ద వాటాదారుగా ఉండనుంది. విలీన సంస్థకు ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ కో–చైర్మన్‌గాను, ఆయన కుమారుడు శ్రావిన్‌ భారతి మిట్టల్‌ .. డైరెక్టరుగా ఉంటారు. యూటెల్‌శాట్‌ ప్రస్తుత చైర్మన్‌ డొమినిక్‌ డి హినిన్‌ .. విలీన సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డీల్‌ ప్రకారం వన్‌వెబ్‌ షేర్‌హోల్డర్లకు యూటెల్‌శాట్‌ కొత్తగా 23 కోట్ల షేర్లను జారీ చేస్తుంది.

తద్వారా పెరిగిన షేర్‌ క్యాపిటల్‌లో ఇరు సంస్థల షేర్‌హోల్డర్ల వాటా చెరి 50 శాతంగా ఉండనుంది. వన్‌వెబ్‌లో 100 శాతం వాటాలు యూటెల్‌శాట్‌కు దఖలుపడతాయి. 2023 ప్రథమార్ధంలో ఈ డీల్‌ పూర్తి కావచ్చని అంచనా. యూటెల్‌శాట్‌కు 36 జియోస్టేషనరీ ఆర్బిట్‌ (జియో) ఉపగ్రహాలు ఉండగా, వన్‌వెబ్‌కు 648 లో ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 428 ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు