-

భారత్‌పై ఖాన్‌ సాబ్‌ కామెంట్‌.. చిప్ప పట్టుకుంది ఎవరంటూ సొంత ప్రజలే ట్రోలింగ్‌

12 Jan, 2022 17:07 IST|Sakshi

ఛాన్స్‌ దొరికితే చాలు.. ప్రతీ అంశంలోనూ భారత్‌ను లాగి.. అక్కసు వెల్లగక్కుతుంటాడు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. అయితే తాజాగా ఆయన ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ నవ్వులు పూయించడమే కాదు.. రాజకీయ విమర్శలకు,  ఇంటర్నెట్‌లో సొంత ప్రజల నుంచే సెటైర్లు పడేలా చేస్తోంది. 


‘ప్రపంచ దేశాలతో పాకిస్థాన్‌ చౌక దేశంగా ఉంది. చాలా వస్తువులు చీప్‌గా దొరుకుతున్నాయి. కానీ, ప్రతిపక్షాలేమో మమ్మల్ని చేతకానీ ప్రభుత్వం అని విమర్శిస్తున్నారు. మేమేమో అన్ని సంక్షోభాల నుంచి దేశాన్ని రక్షిస్తున్నాం’ అంటూ రావల్పిండిలో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇక్కడితో పరిమితమైతే ఫర్వాలేదు. కానీ, అతిశయోక్తికి పోయి.. భారత్‌ను లాగడంతో అసలు వ్యవహారం మొదలైంది. చాలా దేశాల కంటే పాక్‌ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉందని, ముఖ్యంగా భారత్ కంటే మెరుగ్గా ఉందంటూ కామెంట్‌ చేశాడు. అంతే.. 

బిల్లు దేని కోసం ఖాన్‌ సాబ్‌?
ఇమ్రాన్‌ ఖాన్‌ అధికారంలోకి వచ్చాక పాక్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. చివరకు ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె సైతం చెల్లించలేని స్థితికి చేరుకుంది. ఈ తరుణంలో ఆర్థిక గండం నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సాయం కోసం ప్రాధేయపడుతున్నాడు. అంతేకాదు  బిలియన్ డాలర్ల  ఆర్థిక సాయం కోసం ఐఎంఎఫ్ పెట్టిన ఎన్నో షరతులకు అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. సంబంధిత బిల్లుకు పార్లమెంటు ముద్ర వేయించేందుకు నానా పాట్లు పడుతున్నాడు.

 

సొంత ప్రజలే ట్రోలింగ్‌
ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌ మీద చేసిన కామెంట్‌పై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలే సెటైర్లు పేలుస్తున్నాయి.  ప్రతిపక్ష నేత పీఎంఎల్ ఎన్ అధ్యక్షుడు షెబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని నేషనల్ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తాడు. ఒక వైపు అణుశక్తి దేశంగా ఉంటూ.. మరోవైపు చిప్ప పట్టుకుని అడుక్కోవడం ఎలా సాధ్యమవుతోందని? పైగా భారత్‌ లాంటి దేశం కంటే ఆర్థికంగా మెరుగ్గా ఉన్నామంటూ ఎలా వ్యాఖ్యానిస్తారని ఇమ్రాన్‌ ఖాన్‌ను ఏకీపడేశాడు. ఇక దేశ ఆర్థిక పరిస్థితిని పీఎంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం దివాలా తీయించిందని, కరోనా టైంలో అన్ని రంగాల్లో దెబ్బ తీసిందని, వ్యాక్సినేషన్‌ సంగతి ఏంటని?.. ఇంటర్నెట్‌లో పాక్‌ ప్రజలే ఇమ్రాన్‌పై మీమ్స్‌ వేస్తున్నారు.

మరిన్ని వార్తలు